మన ప్రాణాల రక్షణ.. మన చేతుల్లోనే..!
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:02 AM
మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే ఉందని డీటీసీ నిరంజన్ రెడ్డి అన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

మానవ తప్పిదాలవల్లే ఎక్కువ ప్రమాదాలు
నివారణకు ప్రత్యేక చర్యలు
డీటీసీ నిరంజన్ రెడ్డి
చిత్తూరు సిటీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే ఉందని డీటీసీ నిరంజన్ రెడ్డి అన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 36వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రజ్యోతి డీటీసీతో ముఖాముఖి నిర్వహించింది.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే చాలావరకు ప్రమాదాలు నివారించవచ్చు. ప్రభుత్వం ఏటా జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ అధికారులతో కలసి వాకథాన్ నిర్వహించి.. రహదారి నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రైవర్లకు, విద్యార్థులకు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అవగాహన కార్యక్రమాలతోపాటు ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం.
మొగిలి ఘాట్‌పై ప్రత్యేక దృష్టి
మొగిలి ఘాట్‌లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాం. నివారణ కోసం ఎన్‌హెచ్ అధికారులతో కలసి సూచిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్లు, ఇసుక డ్రమ్ములు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల చాలావరకు ప్రమాదాలను నివారించగలిగాం.
ద్విచక్రవాహనదారులవే ఎక్కువ ప్రమాదాలు
మూడేళ్లలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 350 మంది మరణించారు. ఈ ప్రమదాల్లో 50 శాతం మంది ద్విచక్రవాహనదారులే మరణించారు. ఇందులోనూ 90 శాతం మంది యువత ఉన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, మద్యం తాగి నడపడం, అతివేగంగా హెల్మెట్ లేకుండా వెళ్లడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.