చిరుధాన్యాల ఉత్పత్తికే ప్రాధాన్యం
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:54 AM
చిరుధాన్యాల వినియోగం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తికి జిల్లా టెక్నికల్ కమిటీ ప్రాధాన్యత ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిరుధాన్యాల ఉత్పత్తికి, పంటరుణాల పెంపునకు సిఫార్సు చేసింది.

పంటరుణాల పెంపునకూ టెక్నికల్ కమిటీ సిఫార్సు
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): చిరుధాన్యాల వినియోగం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తికి జిల్లా టెక్నికల్ కమిటీ ప్రాధాన్యత ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిరుధాన్యాల ఉత్పత్తికి, పంటరుణాల పెంపునకు సిఫార్సు చేసింది.కలెక్టరేట్‌లోని జేసీ విద్యాధరి ఛాంబర్‌లో వివిధ బ్యాంకర్లు, జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొర్రలు, సామలు తదితర చిరుధాన్యాల పంటలకు ఎకరాకు రూ. 22వేలు బ్యాంకు రుణాలు ఇస్తుండగా, దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.25 వేలు ఇచ్చేవిధంగా కమిటీ సిఫార్సు చేసింది.ఎకరా మినుములు, పెసలు,ఉలవలు,రాగులు, సజ్జలు, జొన్నలు, ఇతర చిరుధాన్యాలకు రూ.22 వేలు ఇస్తుండగా దానిని రూ.25 వేలకు పెంచింది. హైబ్రిడ్ రకం వరికి ఇస్తున్న రూ.47వేలను రూ.51వేలకు పెంచుతూ ప్రతిపాదించారు.చెరకు (ప్లాంటేషన్)కు రూ.85 వేల నుంచి రూ.1.10లక్షలకు, నీటి ఆధారిత వేరుశనగ పంటకు రూ.35వేల నుంచి రూ.38వేలకు పెంచుతూ సిఫారసు చేసింది. మామిడి తోట నిర్వహణకు రూ.40 వేల నుంచి రూ.42,500కు, మల్బరీకి రూ.80 వేల నుంచి రూ.85 వేలకు పెంచాలని సిఫార్సు చేశారు. టమోటా స్థానిక రకానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు, హైబ్రిడ్ రకానికి రూ.80 వేల నుంచి రూ.90 వేలకు, పెండాల్ రకానికి రూ.95వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ ప్రతిపాదించారు. ఉల్లిపాయకు రూ.40వేల నుంచి రూ.48,500కు, ఉర్లగడ్డకు రూ.40వేల నుంచి రూ.54 వేలకు, మునక్కాయ పంటకు రూ.30 వేల నుంచి రూ.40వేలకు, వంకాయకు రూ.40వేల నుంచి రూ.50వేలకు సిఫార్సు చేశారు. ఎకరా మిరపపంటకు ప్రస్తుతం ఇస్తున్న రూ.75వేల రుణపరిమితిని రూ.లక్షకు పెంచింది. ఎకరా ఆకుకూరల పంటలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.20వేలను రూ.30వేలకు, ఎకరా ధనియాల పంటకు రూ.25వేల నుంచి రూ.30 వేలకు పెంచింది. కరివేపాకుకు రూ.35వేల రుణపరిమితిని రూ.56 వేలకు పెంచారు. పాడిపశువుల కొనుగోలుకు ప్రస్తుతం ఇస్తున్న రూ.30 వేలను రూ.40 వేలకు పెంచారు.కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్రస్థాయి కమిటీకి పంపి, ఆమోదం పొందిన తరువాత ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే పంట రుణాలను అన్ని బ్యాంకులు పంపిణీ చేస్తాయని డీసీసీబీ సీఈవో మనోహర్ గౌడ్ వివరించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం హరీష్, నాబార్డు డీడీఎం సునీల్, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.