Share News

Apps: రేపట్నుంచీ అందుబాటులోకి ఎన్‌ఎంఎంఎ్‌స, ఫేస్‌ ఆర్‌డీ యాప్‌లు

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:04 AM

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మాన్యువల్‌గా ఉన్న మస్టర్లు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా నమోదు కానున్నాయి.

Apps: రేపట్నుంచీ అందుబాటులోకి ఎన్‌ఎంఎంఎ్‌స, ఫేస్‌ ఆర్‌డీ యాప్‌లు
ఉపాధి పనుల్లో కూలీలు

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మాన్యువల్‌గా ఉన్న మస్టర్లు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా నమోదు కానున్నాయి. ఉపాధి పనులు చేసిన కూలీలు నష్టపోకుండా ఉండేలా నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎ్‌స)ను అమల్లోకి తేనున్నారు. దీంతో పాటు ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ను సైతం వినియోగిస్తారు. శనివారం నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రక్రియకు సంబంధించి డ్వామా అధికారులు క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు.

4.40 లక్షలమంది కూలీలు

జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు 2.50 లక్షల జాబ్‌ కార్డులుండగా, కూలీల సంఖ్య 4.30లక్షలుగా నమోదు చేశారు. కూలీలుగా నమోదైన వారికి వంద రోజుల పాటు పనులు కల్పించాల్సి ఉంది. వీరికి మస్టర్లు వేయడానికి 645 మంది ఫీల్డు అసిస్టెంట్లు, 4554 మంది మేట్‌లు ఉన్నారు. వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా నీరు, నేల సంరక్షణలో భాగంగా చెరువులు, కుంటలు తవ్వడం, పంట కుంటలు తవ్వడం, చెరువుల నుంచి పొలాలకు నీటి కాలువలు తీయడం, రెవెన్యూ భూముల్లో కందకాలు తవ్వడం, గుట్టల్లో మొక్కలు నాటడం వంటి పనులను కూలీలకు కల్పించాల్సి ఉంది.

ఇష్టానుసారంగా మస్టర్లు

ప్రస్తుతం జిల్లాలోని 78,361 ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. అయితే కూలీల మస్టర్‌లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోణలు చాలాకాలంగా వున్నాయి. మాన్యువల్‌ మస్టర్లుండడం ఫీల్డు అసిస్టెంట్లకు, మేట్‌లకు వరంగా మారింది. వీరి ఉద్యోగ భద్రత కోసం పనులకు రాకున్నా తమకు అనుకూలమైన కూలీలకు హాజరు వేసేసి లక్ష్యాలు పూర్తైనట్లు చూపడం, మస్టర్లు తప్పులతడకగా నమోదు చేయడం జరిగింది.దీని ద్వారా పలువురు కూలీలు లాభపడగా, కొందరు నష్టపోతున్నారు.వీటిని అరికట్టడానికి కొత్త మస్టర్ల (హాజరు) నమోదు విధానం నవంబరు ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎ్‌స)ను, ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ను సైతం హాజరు వేసేందుకు ఉపయోగించనున్నారు.కూలీలు ఉదయం 8 గంటలకల్లా ఎన్‌ఎంఎంఎ్‌సలో హాజరు నమోదు చేయాల్సి ఉంది. ఆ తర్వాత పని చేస్తున్నాడా, లేదా అని తెలుసుకునేందుకు నాలుగు గంటలకు ఒక సారి హాజరు నమోదు చేయాలి. ఉపాధి పనులకు వచ్చిన కూలీలంతా పనిచేస్తున్నారా, లేదా అనే దానికి ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ను వినియోగిస్తారు. పనిచేస్తున్న సమయంలో కూలీలనంతా ఒక్క చోట చేర్చి, వారిలో ర్యాండమ్‌గా ఎవరినో ఒకరిని ఫేషియల్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయమంటారు. దీని ద్వారా గ్రూపులోని వారంతా పనిలో ఉన్నట్లు గుర్తిస్తారు. కొత్త హాజరు విధానం కోసం క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టారు. 4.30 లక్షల మంది కూలీలకు డ్వామా సిబ్బంది ఈకేవైసీ పూర్తి చేశారు.


కూలీలు నష్టపోకూడదనే కొత్త విధానం: రవికుమార్‌, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌

ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులకు వచ్చిన వారు నష్టపోకుండా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌ఎంఎంఎ్‌స, ఫేస్‌ ఆర్‌డీ యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో 4.30 లక్షల మంది కూలీల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశాం. నవంబరు ఒకటి నుంచి కూలీలకు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ అమల్లోకి వస్తుంది.

Updated Date - Oct 31 , 2025 | 02:04 AM