తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి టికెట్ల కోటా పెంచండి
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:01 AM
తిరుపతి విమానాశ్రయంలో విక్రయించే శ్రీవాణి టికెట్ల కోటా పెంచాలని విమానాశ్రయం అధికారులు టీటీడీని కోరారు.

తిరుపతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి విమానాశ్రయంలో విక్రయించే శ్రీవాణి టికెట్ల కోటా పెంచాలని విమానాశ్రయం అధికారులు టీటీడీని కోరారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 200 టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత విమానాల్లో వచ్చేవారికి టికెట్లు లభించడం లేదు. ఈ సంఖ్యను వెయ్యికి పెంచాల్సిందిగా విమానాశ్రయ అధికారులు కోరినట్లు తెలిసింది. అలాగే రూ. 300ల దర్శన టికెట్ల కౌంటర్‌ను కూడా ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేయాలని, రోజుకు 1000-1500 టికెట్లు కేటాయించాలని కోరారు. ఇందువల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు, పాలకవర్గం ముఖ్యులు చెప్పినట్లు సమాచారం.
20 అడుగుల ఏకశిలా విగ్రహం
అలాగే తిరుపతి విమానాశ్రయం లాంజిలో 20 అడుగుల శ్రీవారి ఏక శిలా విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. ఎయిర్‌పోర్టు వెలుపల కూడా రెండు చిన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శ్రీవారి శిలా విగ్రహాలను భక్తుల సహకారంతో అందించాలంటూ ఎయిర్‌పోర్టు అధికారులు టీటీడీని అభ్యర్థించారు. దీనికి టీటీడీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.