ఉత్సాహంగా మైలారు పండుగ
ABN , Publish Date - Feb 15 , 2025 | 02:07 AM
వి.కోట మండలం జవ్వునిపల్లెలో మైలారు పండుగను శుక్రవారం కోలాహలంగా నిర్వహించారు.యల్లమ్మ, గంగమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పశువుల పండుగను ప్రారంభించారు.

వి.కోట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వి.కోట మండలం జవ్వునిపల్లెలో మైలారు పండుగను శుక్రవారం కోలాహలంగా నిర్వహించారు.యల్లమ్మ, గంగమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పశువుల పండుగను ప్రారంభించారు. గ్రామానికి తూర్పుదిశగా పశువులను పరుగులు పెట్టించారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్య నుంచి పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్దఎత్తున జనం తరలిరాగా ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది ఎద్దులు ఈ పండుగలో పాల్గొన్నాయి. తమిళనాడులోని లత్తేరికి చెందిన ఎద్దుకు ప్రథమ బహుమతిగా రూ. 1.51 లక్షలు, ఏరుగుత్తికి చెందిన ఎద్దుకు రెండవ బహుమతిగా రూ. లక్ష, మూడవ బహుమతిగా వి.కోట మండలం చిన్నశ్యామ గ్రామానికి చెందిన ఎద్దుకు రూ.70 వేలు చొప్పున నిర్వాహకులు అందజేశారు. అలాగే పోటీల్లో సత్తాచూపిన 70 ఎద్దులకు కుక్కర్లు వంటి బహుమతులను వాటి యజమానులకు అందజేశారు.కాగా వి.కోట మండలం కృష్ణాపురానికి చెందిన ఓ ఎద్దు పండుగకు వచ్చి తప్పిపోయింది. దాని యజమాని ఎద్దు ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.