Share News

శ్రీకాళహస్తిలో మట్టి దొంగలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:57 AM

అధికారుల అండతో చెలరేగిపోతున్న గ్రావెల్‌ మాఫియా

శ్రీకాళహస్తిలో మట్టి దొంగలు
శివనాథపాళెంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరిగిన దృశ్యం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి పరిధిలో ఓ గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. అధికారుల తెరచాటు సహకారంతో రాత్రి, పగలు గ్రావెల్‌ను తవ్వేస్తోంది. తొట్టంబేడు మండలం శివనాథపాళెం పరిధిలో చేపట్టిన ఈ అక్రమ గ్రావెల్‌ తవ్వకం... అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలో గ్రావెల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇళ్ల నిర్మాణానికి, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లకు, లోతట్టు స్థలాలను ఎత్తు లేపుకునేందుకు కొంటున్నారు. అలాగే శ్రీసిటీ, రేణిగుంట, ఏర్పేడు, చెన్నై ప్రాంతాలకూ కొందరు అక్రమార్కులు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి శివారు చెన్నై రోడ్డులోని ఓ పెట్రోల్‌ బంకు పక్కన గ్రావెల్‌ మాఫియా ఒక ముఠాగా ఏర్పడి ఆరు నెలల క్రితం కార్యాలయాన్నీ ఏర్పాటు చేసుకుంది. ఆ కార్యాలయం వెనుకనే రెండు నెలల క్రితం భారీ ఇసుక డంప్‌ను అధికారులు సీజ్‌ చేశారు. అప్పటి వరకు చెన్నైకి ఇసుక తరలిస్తున్న ఆ ముఠా.. తర్వాత గ్రావెల్‌వైపు దృష్టి పెట్టింది. తొట్టంబేడు మండలం శివనాథపాళెం పరిధిలోని భూములను తవ్వకాలకు ఎంపిక చేసుకుంది. ఇక్కడే తెలుగుగంగ కాలువ కట్టకు ఆనుకుని శివనాథపాళెం చెరువు ఉంది. మూడేళ్ల కిందట జాతీయ రహదారి నిర్మాణానికి శివనాథపాళెంలో గ్రావెల్‌ తవ్వుకోవడానికి సంబంధిత సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. అప్పటి వైసీపీ నాయకులు ఆ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా చెరువులో వాహనాల రాకపోకలకు అనుమతించారు. అప్పట్లో ఆ సంస్థ చెరువులో తాత్కాలిక బాటను వేసుకుంది. వారి కాలపరిమితి ముగియడంతో అధికారులు చెరువులో బాటకు కందకాలు తవ్వి అడ్డుకట్ట వేశారు. వర్షాలతో చెరువులో బాటా కనుమరుగైంది. రెండు నెలల క్రితం గ్రావెల్‌ మాఫియా కళ్లు శివనాథపాళెంపై పడ్డాయి. చెరువులో పాతబాటపై భారీ లారీలు తిరిగేలా అనధికారికంగా రోడ్డు వేసుకున్నారు. చెరువు నుంచి ఆ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి గ్రావెల్‌ తవ్వేసి రోజూ లక్షలాది రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు.

రెండు నెలల్లో 20 ఎకరాల్లో తవ్వేశారు

నీలగిరి తైలం చెట్ల మఽధ్యలో బీడు భూములు ఉన్నాయి. ఎవరి కంటా పడకుండా గ్రావెల్‌ తవ్వేందుకు పక్కాగా పథకం రచించారు. ఆ ప్రకారం రాత్రి పది నుంచి వేకువజామున 5గంటల వరకు యంత్రాలతో లారీలు, ట్రాక్టర్లకు తవ్వి నింపి పంపించేవారు. ఇలా రెండు నెలల నుంచి సుమారు 20 ఎకరాల్లో గ్రావెల్‌ను తవ్వేశారు. కొందరు అధికారులు వీరికి అండగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. కొందరు అక్రమార్కులు, అధికారులు కలిసి చేస్తున్న ఆగడాలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవల వారం రోజులుగా శివనాథపాళెం పరిసర గ్రామాల ప్రజలు గ్రావెల్‌ మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి శివనాథపాళెం, చిట్టత్తూరు, తెల్లరాళ్లమిట్ట గ్రామాల్లో గ్రావెల్‌ మాఫియా తవ్వకాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:57 AM