అర్ధరాత్రి విషాదం
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:12 AM
త్తూరు సమీపంలో గంగాసాగరం వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి మధురై వెళ్లే ఎస్‌ఆర్‌ఎంఎస్ స్లీపర్ బస్సు రోజూ లాగే గురువారం రాత్రి 9.45 గంటలకు తిరుపతిలో 29మంది ప్రయాణికులతో బయల్దేరింది.రాత్రి 11.50గంటలకు చిత్తూరు సమీపం గాజులపల్లె సమీపాన వెళుతుండగా.. హైవే నిర్మాణ పనుల కోసం మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ వేగంగా ఢీకొంది. దీంతో బస్సు పక్కకు బోల్తా పడింది.

చిత్తూరు అర్బన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : చిత్తూరు సమీపంలో గంగాసాగరం వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి మధురై వెళ్లే ఎస్‌ఆర్‌ఎంఎస్ స్లీపర్ బస్సు రోజూ లాగే గురువారం రాత్రి 9.45 గంటలకు తిరుపతిలో 29మంది ప్రయాణికులతో బయల్దేరింది.రాత్రి 11.50గంటలకు చిత్తూరు సమీపం గాజులపల్లె సమీపాన వెళుతుండగా.. హైవే నిర్మాణ పనుల కోసం మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ వేగంగా ఢీకొంది. దీంతో బస్సు పక్కకు బోల్తా పడింది. రోడ్డు పక్కన పడేసి ఉన్న విద్యుత్తు స్తంభాల్లో ఒకటి బస్సులోకి దూసుకువచ్చింది. అప్పర్ సీట్లలో పడుకుని ఉన్న ప్రయాణికులను ఆ స్తంభం వేగంగా కొట్టడంతో ముగ్గురు బస్సులోనే మరణించారు. వారి తలలు ఛిద్రమైపోయాయి. లోయర్ సీటులో కూర్చున్న మరో వ్యక్తి సీట్ల మధ్యలో నలిగిపోయి మరణించాడు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం గుడిపాల పోలీసులకు చేరగానే ఆ ప్రాంతం తాలూకా స్టేషన్ పరిధిలోది కావడంతో ఇరు ప్రాంతాల పోలీసులూ ఘటనా స్థలానికి చేరుకున్నారు.అటుగా వెళ్తున్న ప్రయాణికులు, చుట్టుపక్కల జనంతో కలసి క్షతగాత్రులను బయటకు తెచ్చి ఆస్పత్రులకు తరలించారు.
ప్రాణాలు తీసిన విద్యుత్తు స్తంభం
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో సబ్‌స్టేషన్ ఉండడంతో.. దానికి సంబంధించిన విద్యుత్తు స్తంభాలు హైవే పక్కన పడేశారు. టిప్పర్ వేగంగా ఢీ కొట్టడంతో బోల్తా పడిన బస్సులోకి అక్కడి విద్యుత్తు స్తంభం ఒకటి దూసుకుపోవడంతో నిద్రలో ఉన్న ముగ్గురు ప్రయాణికుల తలలు ఛిద్రమయ్యాయి. ఒకవేళ అక్కడ స్తంభాలు లేకపోయి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని సహాయక చర్యల్లో పాల్గొన్నవారు చెబుతున్నారు.
మృతుల్లో తిరుపతివాసులు
తిరుపతి సప్తగిరి కాలనీకి చెందిన ముత్తు విజయ్ రాజు కుమారుడు పొన్నుచంద్ర (33), ఎన్జీవో కాలనీకి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారి శ్రీకాంత్ కుమారుడు శ్రీధర్ (21), తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణం సౌరాష్ట్ర వీధికి చెందిన గోవిందరాజన్ కుమారుడు ప్రశాంత్ (31), కన్యాకుమారి జిల్లా తోవలకు చెందిన జీవా (40) అక్కడికక్కడే మృతి చెందారు.తలలు ఛిద్రం కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.వీరిలో తమిళనాడువాసులు తిరుమలలో స్వామి దర్శనం చేసుకుని స్వస్థలానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదంలో మరణించిన నలుగురికీ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఆవరణంలో విలపించడంతో అక్కడున్న వారు కూడా చలించిపోయారు.
అమ్మ కళ్లెదుటే కుమారుడి మృతి
తిరుపతికి చెందిన పొన్నుచంద్ర (21) తన తల్లి సెల్వ సుందరితో కలిసి మధురైలోని ఆస్పత్రికి బస్సులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కింద సీటులో తల్లి కూర్చోగా.. అప్పర్ బెర్త్‌లో పొన్నుచంద్ర పడుకున్నాడు. టిప్పర్ ఢీకొనడం, బస్సు ఓ వైపునకు వాలడం, స్తంభం దూసుకురావడం.. అన్నీ కలిపి పొన్నుచంద్రను మృత్యువు రూపంలో కబళించాయి. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడాన్ని చూసిన ఆ తల్లి తనకూ గాయాలైన విషయాన్ని కూడా మర్చిపోయి కన్నీరుమున్నీరైంది. ప్రస్తుతం ఆమె చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పండుగ కోసం వచ్చి తిరిగి రాని లోకాలకు
సంక్రాంతి సెలవులకోసం తిరుపతికి వచ్చిన కె. శ్రీధర్ వారం రోజులుగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపాడు.ఎన్జీవో కాలనీలో కాపురమున్న ఆదాయ పన్ను శాఖ అధికారి శ్రీకాంత్‌కు చిన్న కుమారుడైన శ్రీధర్ తంజావూరులో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.కళాశాలకని బయల్దేరిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే వార్త తెలియగానే కుటుంబం కన్నీటిపర్యంతమైంది.
సహాయక చర్యలు
నిత్యం రద్దీగా ఉండే చిత్తూరు- వేలూరు మార్గంలో ఈ ప్రమాదంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ఎక్సకవేటర్ సాయంతో బోల్తా పడ్డ బస్సును పక్కకు తొలగించి మృతదేహాలను వెలికితీశారు. గుడిపాల, చిత్తూరు తాలూకా ఎస్‌ఐలు రామ్మోహన్, రమేష్ బాబు క్షతగాత్రులను చీలాపల్లె సీఎంసీతో పాటు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్.. తెల్లవారుజామున మూడు గంటల వరకు అక్కడే వుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.ఏఎస్పీ రాజశేఖర రాజు, డీఎస్పీ సాయినాథ్, సీఐలు శ్రీనివాసరావు, శ్రీధర్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.అక్కడినుంచి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను ఆదేశించారు. చిత్తూరు తాలూకా ఎస్‌ఐ రమే్‌షబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.