Share News

శేష వాహనంపై పరమశివుడి విహారం

ABN , Publish Date - Feb 26 , 2025 | 02:48 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి పరమశివుడు శేష వాహనంపై.. ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగారు.

 శేష వాహనంపై పరమశివుడి విహారం

మహాశివరాత్రికి జిల్లాలోని శివాలయాన్నీ ముస్తాబయ్యాయి. ఆలయాలకు ప్రత్యేక అలంకరణలను చేపట్టారు. వేకువజాము నుంచే వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని పలు ఆలయాల్లో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పలుచోట్ల భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేయనున్నారు. ఆలయాల్లో పగలంతా ప్రత్యేక అభిషేకాలు, పూజలు, సాయంత్రం హరికథా కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి జాగారం చేసే భక్తులకోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తమ్మీద బుధవారం శివాలయాలన్నీ భక్తజనంతో సందడిగా మారనున్నాయి.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి పరమశివుడు శేష వాహనంపై.. ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగారు. అంతకుముందు ఆలయ అలంకార మండపం, యాగశాలల్లో ప్రత్యేక పూజలు చేశారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ప్రదక్షిణగా గురుదక్షిణామూర్తి సన్నిధినుంచి రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ శేష, యాళి వాహనాలపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. స్వామిఅమ్మవార్ల ముందు మూషికవాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ స్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది. స్వామిఅమ్మవార్ల పరివారాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఉదయం.. స్వామి అమ్మవార్లు హంస, శుక వాహనాలపై ఊరేగారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో బాపిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 02:48 AM