Kanipakam: మూషిక వాహనంపై వినాయకుడి విహారం
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:45 AM
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు. కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె, కాణిపాకపట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం చేశారు. అనంతరం స్వామికి చందనాలంకారం చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మూలవిరాట్‌ను చందనంతో కప్పి స్వామి రూపం స్పష్టంగా కనపడేలా ఉల్లెన్ దారాలను వినియోగిస్తారు. అందువల్ల స్వామిని దర్శించు కోవడానికి భక్తులు ఎంతో ఇష్టపడతారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకొచ్చి అలంకార మండపంలో ఉత్సవర్లకు విశేష పూజలు నిర్వహించాక భక్తులకు ప్రసాదాలు పంచారు. తర్వాత సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను మూషిక వాహనంపై ఉంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. కాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరఫున ఈవో శీనానాయక్, ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ శనివారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరిని ఈవో పెంచలకిషోర్ సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్‌కు ఈ పట్టు వస్త్రాలను అందించారు. ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, ధనపాల్, ధనంజయ, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు పాల్గొన్నారు.వరసిద్ధుడికి ఆదివారం ఉదయం బంగారు చిన్న శేషవాహన సేవ, రాత్రి బంగారు పెద్ద శేషవాహన సేవ జరగనుంది.