కల్లుగీత కార్మికుల నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jan 28 , 2025 | 01:42 AM
కల్లుగీత కార్మికుల నుంచి 10 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) విజయ్ శేఖర్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలిపారు.
ఫిబ్రవరి 5వరకు స్వీకరణ
7న లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన డీసీ
చిత్తూరు సిటీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కల్లుగీత కార్మికుల నుంచి 10 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) విజయ్ శేఖర్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలిపారు. జిల్లాలోని కల్లుగీత కార్మికులకు ఉపకులాల జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలను కలెక్టర్ కేటాయించారని చెప్పారు. ఈ దుకాణాలకు సోమవారం నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సమీపంలోని ఎక్సైజ్ స్టేషన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. ఏడో తేదీన ఉదయం 10 గంటలకు చిత్తూరులోని కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా పారదర్శంగా దుకాణాలు కేటాయిస్తారని చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకై దరఖాస్తు చేసుకోవచ్చని.. అయితే ఒకే దుకాణం కేటాయిస్తారని స్పష్టం చేశారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఈడిగ కులస్తులకు ఏడు మద్యం దుకాణాలు.. గౌడ, గౌండ్ల, గౌడ్ ఉపకులాలకు ఒక్కో దుకాణాన్ని కేటాయించారని గుర్తుచేశారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్, పుంగనూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీ, చిత్తూరు రూరల్, గుడిపల్లె, వి.కోట దుకాణాలను ‘ఈడిగ’ ఉపకులానికి, పాలసముద్రం దుకాణాన్ని ‘గౌడ’ ఉపకులానికి, వెదురుకుప్పం దుకాణాన్ని ‘గౌడ్’ ఉపకులానికి, పెద్ద పంజాణి దుకాణాన్ని ‘గౌండ్ల’ ఉపకులానికి కేటాయించారు. ఏకులానికి చెందినవారు ఆకులానికి చెందిన దుకాణానికే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేయడానికి ఇటీవల తీసిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఓటరు ఐడీ కార్డు / డ్రైవింగ్ లైసెన్సు /పాస్‌పోర్టు/బ్యాంక్ పాస్‌బుక్కు/ ఆధార్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు సమర్పించాలని చెప్పారు. ఈఎస్ శ్రీనివాస్, ఏఈఎస్ కృష్ణకిషోర్, సీఐ శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.