ఉదయం పెళ్లి పీటలపై.. సాయంత్రం ఉరితాడుకు వేలాడుతూ..
ABN , Publish Date - Jan 22 , 2025 | 01:53 AM
కాళ్ల పారాణి ఆరలేదు. నుదుట కట్టిన భాసిక తీయనే లేదు. తలపై వేసిన అక్షతలు రాలనే లేదు. మంగళ వాయిద్యాల సందడి సద్దుమణగనే లేదు. పెళ్లికొచ్చిన బంధువులు ఇళ్లకు చేరనే లేదు. పెళ్లి పీటలెక్కి గంటలైనా గడవ లేదు.. అంతలోనే ఆ వధువు అనంతలోకాలకు తరలి వెళ్లింది.
ఆంబాకంలో నవ వధువు బలవన్మరణం
సత్యవేడు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కాళ్ల పారాణి ఆరలేదు. నుదుట కట్టిన భాసిక తీయనే లేదు. తలపై వేసిన అక్షతలు రాలనే లేదు. మంగళ వాయిద్యాల సందడి సద్దుమణగనే లేదు. పెళ్లికొచ్చిన బంధువులు ఇళ్లకు చేరనే లేదు. పెళ్లి పీటలెక్కి గంటలైనా గడవ లేదు.. అంతలోనే ఆ వధువు అనంతలోకాలకు తరలి వెళ్లింది. ఉదయం పెళ్లి జరగ్గా.. సాయంత్రానికి బలవన్మరణానికి పాల్పడింది. సత్యవేడు మండలం ఆంబాకంలో ఈ విషాద ఘటన జరిగింది. ఎస్‌ఐ రామస్వామి తెలిపిన ప్రకారం.. ఆంబాకం గ్రామానికి చెందిన ధనుంజయ, రది దంపతుల కుమార్తె ఆర్తి(20) చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఈమె మేనమామ సూర్యతో వివాహం నిశ్చయమైంది. ఊతుకోటలో సోమవారం వీరిద్దరి వివాహం జరిపించారు. అటునుంచే నూతన వధూవరులను తీసుకుని తిరుత్తణి ఆలయానికి వెళ్లారు. మధ్యాహ్నం వరుడు సూర్య ఇంటికి వచ్చారు. తనకు అలసటగా ఉందంటూ నిద్ర పోయేందుకు బెడ్‌రూంలోకి వెళ్లిన ఆర్తి తలుపులు మూసుకుంది. సాయంత్రం అవుతున్నా బయటకు రాలేదు. ఎంత పిలిచినా పలకలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గడియ పగులకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. వెంటనే ఆమెను ఊతుకోటలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామస్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన గంటల్లోనే పెళ్లికూతురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.