హరహర మహాదేవ
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:46 AM
‘హరహర మహాదేవ.. శంభశంకర’ అంటూ జిల్లాలోని ఈశ్వరాలయాలు బుధవారం శివనామ స్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు రావడంతో రద్దీగా కనిపించాయి. దక్షిణ కైలాసంగా పేర్కొనే శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. స్వర్ణముఖి నదిలో స్నానాలు.. పితృదేవతలకు తర్పణం వదిలేవారు.. శంఖం పూరించే జంగమదేవరలు.. స్వామి దర్శనానికి వచ్చిన జనంతో పురవీధులు రద్దీగా మారాయి. మహాశివరాత్రి సందర్భంగా వాయులింగేశ్వరుడు నిజమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ‘హరహర మహాదేవ.. శంభశంకర’ అంటూ జిల్లాలోని ఈశ్వరాలయాలు బుధవారం శివనామ స్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు రావడంతో రద్దీగా కనిపించాయి. దక్షిణ కైలాసంగా పేర్కొనే శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. స్వర్ణముఖి నదిలో స్నానాలు.. పితృదేవతలకు తర్పణం వదిలేవారు.. శంఖం పూరించే జంగమదేవరలు.. స్వామి దర్శనానికి వచ్చిన జనంతో పురవీధులు రద్దీగా మారాయి. మహాశివరాత్రి సందర్భంగా వాయులింగేశ్వరుడు నిజమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు నాలుగు కాలాల అభిషేకాలు జరిగితే.. శివరాత్రి నాడు మాత్రం (బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువన లింగోద్భవం వరకు) 11 కాలాభిషేకాలు నిర్వహించారు. ఇక, బుధవారం వేకువజామున 2 గంటలకు అర్చకులు స్వామి, అమ్మవార్లను మేల్కొలిపారు. పూజల అనంతరం 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రుద్రాభిషేకంతో పాటు పచ్చకర్పూరాభిషేకం, పంచామృతాభిషేకం ఒకదాని వెంట ఒకటి స్వామివారికి నిర్వహించారు. వీటితో స్వామివారు నిత్యాభిషేక మూర్తిగా దర్శనభాగ్యం కల్పించారు. జ్ఞానప్రసూనాంబిక దేవికీ అభిషేకాలు నిర్వహించారు. వేకువజామున 4 గంటల నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఆలయం లోపల భక్తులకు మహాలఘు దర్శన విధానం అమలు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయలింగం నుంచి ఆలయం పైకి వెళ్లి భక్తకన్నప్ప కొండమెట్ల మార్గం వద్దకు చేరుకునేలా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసి మహాద్వారం వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో తోపులాటకు తావులేకుండా పోయింది. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు అందజేశారు. సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చినట్లు ఆలయాధికారుల అంచనా.
మహాప్రసాదంగా వాయనం
ఈసారి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. మహిళలకు రవికతో పాటు పసుపు, కుంకుమ, గాజులను కలిపి వాయనంగా అందించారు. క్యూలైన్లలో భక్తులకు వాటర్‌బాటిళ్లు, బిస్కెట్లు అందజేశారు.
ఇంద్ర విమానంపై శివయ్య
బుధవారం ఉదయం ఇంద్ర విమానంపై స్వామి, చప్పరంపై జ్ఞానప్రసూనాంబ దేవి అధిరోహించారు. మూషికవాహనంపై వినాయకుడు, శ్రీవల్లీ, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగింపులో ముందు సాగారు. ఊరేగింపు ముందు కళారూప ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడి, ఉభయదారులు పాల్గొన్నారు.
రాత్రి నందిసేవ
భక్తకోటిని అనుగ్రహించేందుకు బుధవారం రాత్రి నందివాహనంపై స్వామివారు, సింహవానంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఊరేగింపును తిలకించేందుకు.. జాగరణచేసి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీకాళహస్తీశ్వరాలయం, మాడ వీధులు కిక్కిరిసిపోయాయి.
పటిష్ఠ బందోబస్తు
మహాశివరాత్రికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఎస్పీ హర్షవర్ధనరాజు క్యూలైన్లను, క్రౌడ్ కంట్రోల్‌ను పర్యవేక్షించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. క్యూలైన్ల వద్ద తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టారు. శ్రీకాళహస్తి పరిసరప్రాంతలలో 398 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పురవీధులలో డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేశారు. ట్రైనీ ఎస్పీ బి.హేమంత్, అదనపు ఎస్పీలు కె.రవిమనోహరాచారి, ఐ.రామకృష్ణ, డీఎస్పీలు నరసింహ మూర్తి (శ్రీకాళహస్తి), రామకృష్ణచారి (తిరుపతి ట్రాఫిక్) చెంచుబాబు (నాయుడుపేట), విజయ్‌శేఖర్ (తిరుమల), సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
సాయంత్రం నుంచి ట్రాఫిక్ చిక్కులు
శ్రీకాళహస్తిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ అదుపులోనే కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత పట్టణవాసులు ద్విచక్ర వాహనాలు, కార్లతో అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. దీంతో మాడవీధుల్లో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. పెళ్లి మండపం, సూపర్ బజార్ కూడలి, రాజగోపురం, బిక్షాల గాలిగోపురం, బేరివారి మండపం, జయరామరావు వీధిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ట్రాఫిక్ సమస్యను గుర్తించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 11 గంటలకు: రథోత్సవం
రాత్రి 8.00 గంటలకు: తెప్పోత్సవం