Share News

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులు వేగవంతం

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:02 AM

సమాంతరంగా చేపట్టిన సైడ్‌వాల్స్‌ కాంక్రీటు పనులు

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులు వేగవంతం
రాజుపేట వద్ద సైడ్‌వాల్స్‌ కాంక్రీటు పనులు

రామకుప్పం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కాలువ విస్తరణ పనులు రామకుప్పం మండలం వర్థికుప్పం, రాజుపేట వద్ద చకచకా సాగుతున్నాయి.దీంతో 2014 నుంచి హంద్రీ-నీవా జలాల కోసం ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరలోనే ఉన్నట్టు కన్పిస్తోంది.2014లో టీడీపీ ప్రభుత్వం హంద్రీ-నీవా కుప్పం కెనాల్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8మండలాల్లో 110చెరువులకు నీరు చేరి, వాటి కింద ఉన్న 6300ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమయ్యేలా 123 కిలోమీటర్ల మేర కాలువ ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.575కోట్లు మంజూరు చేసింది. 2019 ఎన్నికలకు ముందే కుప్పం కెనాల్‌ పనులు 90శాతం పూర్తి చేయించింది. 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేశాక మిగిలిన 10శాతం పనులు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎన్నికలకు ముందు ఎక్కడో నీటికి అడ్డుకట్ట వేసి, ఆ నీటిని కుప్పానికి అందిస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం హడావిడి చేసింది. రామకుప్పం మండలం రాజుపేట వద్ద సినీఫక్కీలో గేటు ఏర్పాటు చేసి స్వయంగా అప్పటి సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆ జలాలు శాంతిపురం మండలానికి కూడా చేరుకోలేదు. రామకుప్పం దాకా వచ్చిన ఆ జలాలు ఎక్కడి నుంచి తరలించారో కూడా అప్పటి పాలకులు, అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం.గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘనవిజయం సాధించి, సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడంతో హంద్రీ-నీవా పనుల్లో కదలిక ఏర్పడింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రెండోసారి కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు హంద్రీ-నీవా కాలువల దుస్థితిని పరిశీలించారు. హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జూన్‌ నెల లోపు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి జలాలు తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. అదేవిధంగా హంద్రీ-నీవా జలాలను పాలారు నదికి తీసుకురావడమే కాకుండా,ఆ నదిపై మరిన్ని చెక్‌డ్యాంలు నిర్మిస్తామని తెలిపారు. జలాలు భూమిలో ఇంకకుండా, వృథా కాకుండా, వేగంగా గమ్యస్థానానికి తీసుకెళ్ళేలా పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 డిసెంబరులో పలమనేరు-కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ వెడల్పు, లైనింగ్‌ పనులకు రూ.97.7కోట్లు మంజూరు చేశారు.దీంతో నెల రోజులుగా వర్థికుప్పం,రాజుపేట వద్ద కాలువ వెడల్పు, జలాలు భూమిలోకి ఇంకకుండా కింద సీసీ బెడ్డింగ్‌, దానిని అనుసంధానిస్తూ కాలువ ఇరువైపులా పక్క గోడలకు సీసీ లైనింగ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం రాజుపేట వద్ద ఓ వైపు కాలువ విస్తరణ పనులు, మరో వైపు బెడ్డింగ్‌, లైనింగ్‌ పనులు చకచకా సాగుతున్నాయి. అంతేకాకుండా తంబళ్ళపల్లె నుంచి మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకు 225.35 కిలోమీటర్ల మేర కాలువ విస్తరణకు ప్రభుత్వం గత అక్టోబరులో రూ.348కోట్లు మంజూరు చేసింది. గత సెప్టెంబరు 26న పెద్దతిప్పసముద్రం మండలం దొరిగుండ్లపల్లె వద్ద కాలువ విస్తరణ పనులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఎక్కడి కక్కడ కాలువ విస్తరణ పనులు చురుగ్గా సాగుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 18 , 2025 | 01:02 AM