గోవిందా..?
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:06 AM
శేషాచలం కొండల్లో ఆకుపచ్చని అడవి ఒడిలో ఒదిగినట్టుగా ఉండే చల్లని, ప్రశాంత ప్రదేశం తిరుమల. మంద్రంగా వినిపించే గోవిందలు.. అన్నమయ్య కీర్తనలు.. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ వాతావరణంలో సకల పరుగులనూ మరచి సేదదీరుతారు. అయితే ఈ ప్రశాంతత కొన్నేళ్లుగా భగ్నం అవుతోంది. శబ్ద కాలుష్యం తిరుమల కొండల హద్దులు దాటేస్తోంది. అసాధారణ స్థాయిలో శబ్దకాలుష్యం నమోదవుతోంది.

. తిరుమలలో పెరిగిపోతున్న శబ్దకాలుష్యం
శేషాచలం కొండల్లో ఆకుపచ్చని అడవి ఒడిలో ఒదిగినట్టుగా ఉండే చల్లని, ప్రశాంత ప్రదేశం తిరుమల. మంద్రంగా వినిపించే గోవిందలు.. అన్నమయ్య కీర్తనలు.. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ వాతావరణంలో సకల పరుగులనూ మరచి సేదదీరుతారు. అయితే ఈ ప్రశాంతత కొన్నేళ్లుగా భగ్నం అవుతోంది. శబ్ద కాలుష్యం తిరుమల కొండల హద్దులు దాటేస్తోంది. అసాధారణ స్థాయిలో శబ్దకాలుష్యం నమోదవుతోంది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి
హారన్ల మోత!
ప్రతిరోజు 7 నుంచి 10 వేల వాహనాలు తిరుమలకు చేరుకుంటున్నాయి. రద్దీరోజులు, విశేష పర్వదినాల్లో వీటి సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. వీటిలో ఆర్టీసీ బస్సులు, భక్తుల వాహనాలు, ట్యాక్సీలు, ద్విచక్రవాహనాలు, లారీలు, టీటీడీ అధికారులు కార్లు, ఉద్యోగుల బస్సులు ఉంటాయి. కొవిడ్ తర్వాత దాదాపు 75 శాతం భక్తులు సొంత వాహనాల్లోనే తిరుమలకు చేరుకుంటున్నారు. ఫలితంగా తిరుమలలో విపరీతంగా వాహనాల రద్దీ పెరిగిపోతోంది. ముందుకు కదిలేందుకు హారన్లు మోగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు. కాలంచెల్లిన ట్యాక్సీలు, వాహనాల ద్వారా కూడా వాయు, శబ్ధ కాలుష్యాలు తిరుమలలో పెరిగిపోతున్నాయి. జన సందడి పెరగడంతో టీటీడీ బ్రాడ్‌కాస్టింగ్‌లో కూడా నాయిస్ లెవల్స్ ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
ఉండాల్సిన శబ్దస్థాయి..
యూనివర్సిటీలు, ఆస్పత్రులు, ఆలయాలు వంటి వాటిని సైలెంట్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రదేశాల్లో పగటి పూట 50, రాత్రి వేళలో 40 డెసిబెల్స్ కంటే ఎక్కువగా శబ్ధాలు ఉండకూదదు. అనారోగ్యంతో ఉన్నవారికి, విద్యార్ధులకు, దేవుడి సన్నిధిలో గడుపుదామని వచ్చిన వారికి శబ్దం ఒక శత్రువు. నివాస ప్రాంతాల్లో పగలు 55, రాత్రి 45 డెసిబెల్స్ దాకా భరించవచ్చు. వాణిజ్య ప్రాంతాల్లో ఇది 65-55 దాకా అనుమతి ఉంటుంది. పారిశ్రామిక వాడల్లో ఇది 75-70 గా ఉంటుంది.
తిరుమలో ఇలా ఉంది..
గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు రికార్డులను పరిశీలిస్తే తిరుమలలో సగటున పగటి వేళల్లో 60.5, రాత్రి వేళల్లో 59.68 డెసిబెల్స్ వరకు నాయిస్ లెవల్స్ నమోదయ్యాయి. అంటే వాణిజ్య ప్రాంతాల్లో ఉన్నంత శబ్దం తిరుమలలో ఉంటోందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇండస్ర్టియల్ జోన్ స్థాయి శబ్ధాలు కూడా తిరుమలలో నమోదయ్యాయి. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. భక్తులు చెవులు మూసుకుని, మొఖం చిట్లుంచుకుని తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.