దైవ దర్శనానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు..!
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:41 AM
ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో దంపతుల దుర్మరణం మృతులది హైదరాబాదు
పెళ్లకూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు, ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆగి ఉన్న మినీ లారీని వీరి కారు ఢీకొంది. పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతానికి చెందిన గన్ను మాధవకృష్ణ(48)కు, పోకల సరితా సుమంగళి(43)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిన వీరు పదేళ్ల పాటు అక్కడే ఉంటూ.. హైదరాబాద్‌లోని ఆంజనేయనగర్ కాలనీ, రోడ్డు నెంబర్5, బోడుప్పల్ ప్రాంతంలో ఇంటిని నిర్మించుకున్నారు. వీరి కుమారుడు నిషాంత్ చదువు కోసం అయిదేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చారు. డెలాయిట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మాధవకృష్ణ, టెక్ మహీంద్రలో సరితా సుమంగళిలో పనిచేస్తున్నారు. బుధవారం పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షణకు వీరిద్దరూ వచ్చారు. శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని.. అనంతరం శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడిని దర్శించుకుని ఇంటికి బయలుదేరారు. మధ్యాహ్నం సమయానికి వీరి కారు.. పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్దకు చేరింది. ఆ సమయంలో కారు నడుపుతున్న మాధవకృష్ణ అలసి కునుకు తీశాడో ఏమో కానీ జాతీయ రహదారి రోడ్డు మార్జిన్‌లో నిలిపి ఉన్న మినీ లారీని వీరి కారు ఢీకొంది. లారీ కిందకు దూసుకెళ్లడంతో బెలూన్లు ఓపెన్ అయినా ముందు సీట్లో ఉన్న దంపతులు దుర్మణం చెందారు. ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సాయంతో ట్రాక్టర్‌కు తాడు కట్టి అతికష్టం మీద కారును బయటకులాగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, రూరల్ సీఐ సంగమేశ్వరరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లారీ ఆపడానికి కారణం గురించి డ్రైవర్‌ను అడిగారు. రహదారి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిమిత వేగంతో ప్రయాణించాలని డీఎస్పీ సూచించారు.
అమ్మమ్మ వారించడంతో..
మాధవ కృష్ణ, సరితా సుమంగళి దంపతులు ఎక్కడకి వెళ్లినా తమ కుమారుడు నిషాంత్‌ను వెంట తీసుకెళ్లేవారు. ఇలా వెళ్లిన ప్రతిసారి అతడు అనారోగ్యానికి గురయ్యేవాడు. తిరువణ్ణామలైకి కూడా నిషాంత్‌ను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా.. అతడి అమ్మమ్మ, తాతయ్య వారించారు. దీంతో కుమారుడి వద్ద వారిని ఉంచి.. వీరిద్దరే వచ్చారు. దీంతో అతిపెద్ద ప్రమాదం నుంచి నిషాంత్ బయటపడ్డాడు. తల్లిదండ్రుల మృతితో అనాథగా మారాడు.