నేటి నుంచి ప్లెమింగో ఫెస్టివల్
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:09 AM
సూళ్లూరుపేటలో సంక్రాంతి, ఏటి పండుగ ముగియగానే పక్షుల సంబరాలు వచ్చేశాయి. పులికాట్, నేలపట్టులకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ శనివారం నుంచి మూడు రోజుల పాటు పక్షుల పండగ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర టూరిజం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జూనియర్ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

సూళ్లూరుపేట/తడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేటలో సంక్రాంతి, ఏటి పండుగ ముగియగానే పక్షుల సంబరాలు వచ్చేశాయి. పులికాట్, నేలపట్టులకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ శనివారం నుంచి మూడు రోజుల పాటు పక్షుల పండగ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర టూరిజం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జూనియర్ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఉదయం చెంగాళమ్మ ఆలయం నుంచి శోభాయాత్రలో మంత్రులు పాల్గొని కళాశాల మైదానంలో జరిగే ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. కళాశాల మైదానంలో స్టేజీ, స్టాల్స్, డిజిటల్ గ్యాలరీలు సిద్ధం చేశారు. భీములవారిపాళెంలో పడవషికారుకు 35 పడవలను సిద్ధం చేశారు. లైఫ్ జాకెట్‌లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. అక్కడే స్టేజీ నిర్మించి స్థానిక కళాకారుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అటకానితిప్ప, శ్రీసిటీలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 22 మంది ఎస్‌ఐలతో సహా 400 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యాటకులను అటకానితిప్ప, నేలపట్టు, భీములవారిపాళెంలకు తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు.
వలస పక్షులకు ఆహ్వానం పలుకుతూ..
ఏటా శీతాకాలంలో పులికాట్ సరస్సు, నేలపట్టు ప్రాంతాలకు వలస వచ్చే విదేశీ విహంగాలకు ఆహ్వానం పలుకుతూ వాటి విశిష్టతను తెలియజేసేందుకు 2001లో తొలిసారిగా పక్షుల పండగకు అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి ఉమ్మడి నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఈ పండగ నిర్వహించారు. పులికాట్‌కు వచ్చే వలస పక్షుల్లో అరుదైన ప్లెమింగో పేరుతో ఈ పండగను ఏటా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పండగను ఆట్టహాసంగా చేస్తూ వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది చేసి తర్వాత ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మొత్తం 5 చోట్ల పండగ నిర్వహిస్తున్నారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానం, అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం, బీవీపాలెం, శ్రీసిటీలో నిర్వహించేందుకు జిల్లా అఽధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.