Share News

తిరుమల ఘాట్‌, పార్వేటమండపం వద్ద కనిపించిన ఏనుగు

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:22 AM

ఎటు నుంచి ఏ ఏనుగు వస్తుందో.. అని భక్తులతో పాటు టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఘాట్‌తో పాటు తిరుమల పరిసర ప్రాంతాల్లోనూ ఏనుగుల జాడ కనిపిస్తూనే ఉంది. దీంతో మళ్లీ గజరాజుల భయం మొదలైంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ముందు జాగ్రత్తగా జనసంచారాల్లో ఏనుగులు రాకుండా వైల్డ్‌లైఫ్‌ అధికారులతో టీటీడీ చర్చలు మొదలు పెట్టంది.

తిరుమల ఘాట్‌, పార్వేటమండపం వద్ద కనిపించిన ఏనుగు
Elephant

  • తరచూ తిరుమల ఘాట్‌, పార్వేటమండపం వద్ద ప్రత్యక్షం

  • భయాందోళనకు గురిచేస్తున్న గజరాజులు

  • జనావాసాల్లోకి రాకుండా టీటీడీ చర్యలు

తిరుమల, ఆంధ్రజ్యోతి: చిరుతల సంచారం కాస్త తగ్గిందనుకునే లోపే తాజాగా మళ్లీ ఏనుగుల సంచారం అధికారులను కలవర పెడుతోంది. మొదటి ఘాట్‌లో గురువారం ఏనుగులు కనిపించడంతో భక్తులు, టీటీడీ ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం తిరుమలకు సమీపంలో 12 ఏనుగులతో ఓ గుంపు, 13 ఏనుగులతో మరో గుంపు సంచరిస్తున్నాయి. ఆహారం, నీటి కోసం ప్రధాన ఏనుగు రూట్‌మ్యా్‌పను సిద్ధం చేసి ముందుకు సాగుతుందని, దానికి అనుగుణంగా మిగిలినవి అనుసరిస్తాయని అధికారులు చెబుతున్నారు.


ఇలా.. పార్వేటమండపం, గోగర్భండ్యాం, శ్రీగంధం వనం మీదుగా కాకులకొండ వెనుకనుంచి మామండూరుకు వెళ్లి.. తిరిగి అవ్వాచారి కొనలోయ మీదుగా ఘాట్‌రోడ్డుకు సమీపానికి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఏనుగుల కదలికలతో భక్తులు హడలిపోతున్న క్రమంలో అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తిరుమల జనసంచారంలోకి, ఘాట్‌రోడ్లు, కాలినడక మార్గాల్లోకి ఏనుగులు రాకుండా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.


ఇందులో భాగంగానే వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధికారులను టీటీడీ సంప్రదించింది. శుక్రవారం వైల్డ్‌లైఫ్‌ అధికారుల బృందం పార్వేటమండపం పరిసర ప్రాంతాలతో పాటు ఘాట్‌రోడ్లను పరిశీలించింది. అడవి నుంచి జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా రైల్వేపట్టాల తరహాలో ఇనుప రాడ్లతో రైలింగ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని టీటీడీ వ్యక్తపరిచినట్టు తెలిసింది. ఐదారు అడుగుల ఎత్తులో రెండు వరసలతో రైలింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఏనుగులు తిరుమల పరిసర ప్రాంతాల్లోకి రావనే అభిప్రాయాన్ని టీటీడీ ఫారెస్ట్‌ అఽధికారులు వ్యక్తపరిచారు.


దీనిపై వైల్డ్‌లైఫ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 29వ తేదీ వైల్డ్‌లైఫ్‌ ప్రధాన సైంటిస్ట్‌ తిరుమలకు రానున్నారు. వారంరోజుల్లో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు భక్తులపై ఎలాంటి దాడులు చేయకపోయినప్పటికీ వీడియోలు, ఫొటోలు తీస్తున్నవారిని ఏనుగులు తరిమిన ఘటనలు ఉన్నాయి. ఈక్రమంలో భవిష్యత్తులో ఏనుగుల ద్వారా భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతో టీటీడీ ఏనుగుల సంచారాన్ని జనవాసాల్లో నివారించేదిశగా అడుగులేస్తోంది.


పదేళ్లుగా తరచూ సంచారం

తిరుమల పరిసర ప్రాంతాల్లో పదేళ్లుగా ఏనుగుల గుంపులు తరచూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే..

  • 2015 మార్చిలో ఓ ఏనుగుల గుంపు పార్వేటమండపం వద్దనున్న శ్రీగంధ వనంలో బీభత్సం సృష్టించాయి. ఇనుప కంచె, అక్కడక్కడా నిర్మించిన రాతిగోడను ధ్వంసంచేసి, అనేక చెట్లను నేలకూల్చాయి.

  • 2016లోనూ పార్వేటమండపం వద్దనున్న ఓ నీటి గుంట వద్దకు వచ్చిన ఏనుగులు.. రోడ్డుపక్కనున్న చెట్లను కూల్చాయి. ఆ సమయంలో ఫారెస్ట్‌ అధికారులు పాపవినాశన మార్గాన్ని మూడురోజుల పాటు మూసివేశారు.

  • 2018లో శ్రీవారి పాదాల మార్గంలోని మిర్యాలతోట వద్ద ఏనుగుల గుంపు బీభత్సం చేశాయి.

  • ఇక, కొవిడ్‌ సమయంలో ఏనుగుల సంచారం మరింతగా పెరిగిపోయింది. తరచూ తిరుమల సమీపానికి వచ్చి వెళ్లడం సాధారణమైపోయింది. శ్రీవారిపాదాల మార్గంతో పాటు పార్వేటమండపం, గోగర్భం డ్యాం వద్ద ఏనుగులు ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 2022 మార్చి, మే, 2024 ఫిబ్రవరి నెలల్లో పార్వేటమండపం వద్ద కంచె, చెట్లు ధ్వంసం చేసిన ఘటనలున్నాయి. 2024 ఏప్రిల్‌ నెలలో శిలాతోరణం వద్ద బీభత్సం చేశాయి.

  • తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌లోని ఏనుగుల ఆర్చ్‌ నుంచి ఏడోమైలు మధ్యలో కూడా ఏనుగుల సంచారం సాధారణమైపోయింది. 2020 జూన్‌ 5న, 2022 ఫిబ్రవరి, మార్చిలో ఘాట్‌రోడ్డులో, అదే నెలలో పాపవినాశనం మార్గంలో కనిపించాయి. 2023 ఏప్రిల్‌15న, జూన్‌ 27న కూడా దాదాపు 12 ఏనుగులు ఘాట్‌రోడ్డు సమీపానికి వచ్చి భక్తులను హడలెత్తించాయి.

  • గతేడాదిలో రెండు సార్లు, తాజాగా గురువారం మరోసారి ఘాట్‌రోడ్డులోని ఏనుగుల ఆర్చ్‌ వద్ద కనిపించాయి. కొన్ని సందర్భాల్లో రోడ్డు దాటుతున్నాయి. ఈ ఘటనలు భక్తులను కలవరపరుస్తున్నాయి.


ఏనుగులను తరమడం శ్రేయస్కరం కాదు

ఏనుగులు ఆహారం, నీటి కోసం ఏడాది పాటు ఓ నిర్దేశిత బాటను ముందుగానే ఎంచుకుంటాయి. దానికి అనుగుణంగానే తరచూ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. నిజానికి వీటి ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఏనుగులు కనిపిస్తే దూరంగా వెళ్లిపోవాలి. వాటిని తరమడం, కర్రలతో వాటి వద్దకు వెళ్లి శబ్ధాలు చేయడం శ్రేయస్కరం కాదు. పిల్లలతో ఉన్న ఏనుగులు మరింత ప్రమాదం. ఎక్కడైనా భక్తులు, స్థానికులు, ఉద్యోగులకు ఏనుగులు కనిపిస్తే సమీపంలో భద్రత, ఫారెస్ట్‌ అఽధికారులకు సమాచారమివ్వాలి. మేము వాటిని దట్టమైన అడవిలోకి పంపేలా చర్యలు తీసుకుంటాం. జనసంచారంలోకి ఏనుగులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తున్నాం.

- శ్రీనివాసులు, డీఎ్‌ఫవో, టీటీడీ ఫారెస్ట్‌

Updated Date - Jan 25 , 2025 | 11:21 AM