డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
ABN , Publish Date - Feb 04 , 2025 | 01:44 AM
అనేక నాటకీయ పరిణామాలకు తెరలేపిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
తిరుపతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): అనేక నాటకీయ పరిణామాలకు తెరలేపిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాలి. అందుకు ఎస్వీయూ సెనేట్ హాలులో ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. 22 మంది మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా అనివార్యమైంది.
హాలులో 22 మంది
ఎస్వీయూ సెనేట్ హాలులోకి సోమవారం ఉద యం 10 గంటల ప్రాంతం లో
వైసీపీ రెబల్ కార్పొరేటర్లతో పాటు కూటమి డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ, మరికొందరు వచ్చారు. అరగంట తర్వాత ఎక్స్‌అఫిషియో సభ్యుడు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రావడంతో మ్తొం 22 మంది సభ్యులు ఎన్నికకోసం వేచిచూశారు.
గేటు బయట టెన్షన్
భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటి నుంచి 23 మంది వైసీపీ కార్పొరేటర్లతో బస్సు బయలుదేరగా.. ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కూడా వచ్చారు. ఎస్వీయూ మెయిన్ గేటు సమీపంలోకి వచ్చేసరికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల వాళ్లు పెద్దసంఖ్యలో మోహరించారు. ఇంతలో బస్సు డోరు అద్దాలు పగిలాయి. ఈ గొడవలో ఐదుగురు కార్పొరేటర్లు బస్సు దిగి వెళ్లిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.వైసీపీ కార్పొరేటర్లను ఎస్వీయూ మెయిన్ గేటునుంచి లోపలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. 17 మంది గేటు లోపలకు వెళ్లారు. మరో ఇద్దరు గైర్హాజరు కాగా, ఓ మహిళా కార్పొరేటర్ అస్వస్థతతో వెనుదిరిగారు.
భూమన ఫోనుతో యూటర్న్
మరికొద్ది క్షణాల్లో వైసీపీ కార్పొరేటర్లు సెనేట్ హాలుకు చేరుకోబోతుండగా ఎంపీ గురుమూర్తికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫోనుచేశారు. ఆ వెంటనే వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన వెనుదిరిగారు. ఓటింగుకు హాజరైతే సంఖ్యాబలం ప్రత్యర్థులకే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమ కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపిస్తూ ఎన్నికను బహిష్కరిస్తే కోరం లేక వాయిదా పడుతుందని భూమన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్ ఇతర కార్పొరేటర్లు వెనక్కి వచ్చి ఏడీ బిల్డింగ్ సర్కిల్ సమీపంలో ఫుట్‌పాత్‌పై కూర్చున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి 12 గంటల్లోపు ఎన్నిక జరగాలి. మరికొంత సమయం కావాలని డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ పలుసార్లు అభ్యర్థించారు. కోరం లేకపోతే నిబంధనల మేరకు గంట సమయం మాత్రమే ఉం టుందని, వాయిదా వే స్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.
మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు
కూటమి నేతలు తమని కిడ్నాప్ చేశారని వస్తున్న వార్తల్లో నిజంలేదని, తామంతా సురక్షితంగా ఉన్నామని కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్ రాయల్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్ తెలిపారు. తమ కార్పొరేటర్లపై దాడి చేసి కిడ్నాప్ చేశారన్న వైసీపీ నేతల ఆరోపణలపై వీరు సెల్ఫీ వీడియోల ద్వారా స్పందించారు. ఎన్నికకు వెళుతున్న సమయంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయపడి తాము సురక్షితంగా ఉన్నామన్నారు. ఎవ రూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.