ఒంటరి.. పిల్లలున్న ఏనుగులను తరమొద్దు
ABN , Publish Date - Jan 22 , 2025 | 01:49 AM
భాకరాపేట, పనబాకం రేంజ్ పరిధిలో 15 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఆహారం కోసం శేషాచల అటవీ సమీప పంట పొలాల్లోకి వస్తున్నాయి. ఏనుగులు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు.. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఆవేశంగా ఉంటాయి.
భాకరాపేట, పనపాకం రేంజ్‌లో 15 గజరాజుల సంచారం
ప్రాణ, పంట నష్టపరిహారం పెంచాం
‘ఆంధ్రజ్యోతి’తో సీసీఎఫ్ సెల్వం
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల సంచారం పెరిగింది. ప్రాణ, పంట నష్టాలకు గజరాజులు తరచూ కారణమవుతున్నాయి. శనివారం రాత్రి చంద్రగిరి మండలం శేషాపురం సమీపంలో ఉప సర్పంచి రాకే్‌షచౌదరిని తొక్కి చంపేశాయి. ఈ క్రమంలో ఏనుగుల గుంపు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
- మంగళం, ఆంధ్రజ్యోతి
భాకరాపేట, పనబాకం రేంజ్ పరిధిలో 15 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఆహారం కోసం శేషాచల అటవీ సమీప పంట పొలాల్లోకి వస్తున్నాయి. ఏనుగులు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు.. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఆవేశంగా ఉంటాయి. చిన్న అలికిడికీ అవి చాలా తీవ్రంగా స్పందిస్తాయి. ఈ పరిస్థితుల్లో వీటిని తరిమే సాహసం చేయొద్దు. వాటికి 500 మీటర్ల దూరంలో ఉండాలి. అప్పుడే అవి దాడికి ప్రయత్నించినా తప్పించుకునే అవకాశాలుంటాయి. అంతకుమించి తక్కువ దూరంలో ఉంటే ఏనుగులు అతివేగంగా పరిగెత్తి దాడి చేయొచ్చు. ఏనుగులు ఉన్నప్పుడు జనం గుంపులుగా ఉండకూడదు. ఆ సమయంలో అవి దాడికి ప్రయత్నిస్తే తప్పించునే క్రమంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో కిందపడి.. ఏనుగులు బారినపడి ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఏనుగులు తిరుగుతున్నాయని తెలిస్తే సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుజాము వరకు ఆ వైపు వెళ్లకుండా ఉండటం మంచిది. రాత్రిపూట ఏనుగులు పంట పొలాల్లో ప్రజలను చూసినప్పుడు కనపడకుండా, శబ్దం చేయకుండా పక్కనే ఉంటాయి. పగటిపూటా ఇలాగే చెట్టు చాటున దాక్కుంటే సమీపానికి వెళ్లేంత వరకు వాటిని చూడలేం. రాత్రిపూట ఏనుగులు పంట పొలాల్లోకి వస్తే ఆ సమయంలో అక్కడికి వెళ్లేవారు డార్క్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తెల్లరంగు, ఏనుగులకు వెలుతురుగా కనిపించే రంగు వేసుకోకూడదు. ఏనుగులను తప్పెట్లు, టపాకాయలు పేల్చి బలవంతంగా అటవీ ప్రాంతంలోకి పంపిస్తే అవి తిరిగి పంట పొలాల్లోకి వచ్చి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. వీటి పరిస్థితిని అర్థం చేసుకున్న అటవీశాఖ అధికారులు మాత్రమే ఏనుగుల గుంపును అడవిలోకి పంపడానికి ప్రయత్నిస్తారు. ఏనుగుల సమాచారంతో పాటు అవగాహన పెంచుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం.
అటవీశాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపడానికి 30 మంది అటవీశాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ననియాల వద్ద రెండు కుంకీ ఏనుగులు ఉన్నాయి. కర్ణాటక నుంచి మరో నాలుగు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం.
నష్టపరిహారం పెంపు.. సత్వరం అందజేత
2024 జూన్‌లో ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. ఏనుగుల దాడిలో చనిపోయిన వ్యక్తులకు గతంలో నష్టపరిహారం రూ.5 లక్షలుంటే ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. అదీ 24 గంటల్లోనే అందజేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.80 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచగా.. స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25వేలు ఇస్తున్నారు. ఎకరా వరి పంటకు రూ.8వేల నుంచి రూ.10వేలకు, చెరకు పంటకు రూ.12వేలు, ఒక కొబ్బరి చెట్టుకు రూ.2వేలు, అరటిచెట్లకు ఎకరాలో నష్టాన్ని బట్టి రూ.24వేల చొప్పున.. వారం రోజుల్లోనే నష్టపరిహారం అందిస్తున్నారు.
ఏనుగులు కనపడ్డాయంటే..
ఎవరికైనా ఏనుగులు కనిపిస్తే 1800 4255909 టోల్ ఫ్రీ నెంబరుకు లేదా ఆ ప్రాంత అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.