దామినేడు వద్ద జిల్లా కోర్టు కాంప్లెక్సు
ABN , Publish Date - Feb 11 , 2025 | 02:02 AM
తిరుపతిలోని కోర్టు సముదాయం తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద ఏర్పాటు కానుంది. నగరంలో ప్రస్తుతమున్న కోర్టు భవనాల సముదాయం చాలడంలేదు.
స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు సీజే
తిరుచానూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని కోర్టు సముదాయం తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద ఏర్పాటు కానుంది. నగరంలో ప్రస్తుతమున్న కోర్టు భవనాల సముదాయం చాలడంలేదు. దీంతో జిల్లాకోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి స్థలం కేటాయించాలని సంబంధిత న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని కోరారు. కొంతకాలంగా జిల్లా కోర్టు కాంప్లెక్సు కోసం చంద్రగిరి, మంగళం, దామినేడు వద్ద స్థలాలను పరిశీలించారు. తిరుపతి నగరానికి, జాతీయ రహదారికి తిరుపతి రూరల్ మండలం దామినేడు దగ్గరగా ఉండటంతో, ఈ స్థలం అనువైందని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు తిరుపతి రూరల్‌మండల రెవెన్యూ అధికారులు దామినేడు వద్ద సర్వే నెంబరు 203, 204, 205 తదితర దానిలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. నాలుగైదురోజుల్లో ఈ 15ఎకరాలను జిల్లా కోర్టు కాంప్లెక్సుకు నిర్మాణానికి కేటాయించి.. వారం వ్యవధిలో కోర్టు అధికారులకు అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాలకు సంబంధించిన రికార్డులను న్యాయశాఖకు అప్పగించే పనుల్లో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ స్థలాన్ని ఏపీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఉమ్మడి జిల్లాపోర్టుపోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి.కృష్ణమోహన్, జేసీ శుభం బన్సల్, ఆర్డీవో రామ్మోహన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గురునాథ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.