Share News

జిల్లాకో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్‌

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:31 AM

రాబోయే మూడేళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ప్రణాళిక వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు.

జిల్లాకో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్‌
మాట్లాడుతున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

మూడేళ్లలో ఏర్పాటుకు కేంద్రం ప్రణాళిక

వ్యాధి గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాం

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాబోయే మూడేళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ప్రణాళిక వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. తిరుపతిలో మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌రెడ్డి, కోలా ఆనంద్‌ తదితర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ ద్వారా 9.93 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. దీనిపై అవగాహన లేకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. క్యాన్సర్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. 1500 బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి 71 లక్షలమందికి క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించగా 66 వేలమంది అనుమానితులుగా తేలారన్నారు. వీరిని ప్రివెంటివ్‌ ఆంకాలజీ యూనిట్స్‌గా పరిగణిస్తున్న బోధనాస్పత్రులకు రెఫర్‌చేసి, మరోసారి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్‌ను నిర్ధారిస్తామన్నారు. ఏ దశలో క్యాన్సర్‌ ఉందో గుర్తించి చికిత్స అందిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలు రొమ్ము, సర్వైకల్‌ కాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.

గత లోపాలను సరిదిద్దుతున్నాం

కూటమి అధికారంలోకి రావడంతో ఐదేళ్ల పీడకల నుంచి రాష్ట్రం బయట పడిందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ‘గత ఐదేళ్లలో రాష్ట్రం 20 సంవత్సరాల వెనుక బడింది. ఆయా లోపాలను సరిదిద్దుకుంటూ ఈ ఐదేళ్లలో 15 సంవత్సరాలు రాష్ట్రం ముందుకెళ్లేలా అభివృద్ధి పనులు చేపట్టాం’ అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. దార్శనికుడైన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. దీనికి కేంద్రం సహకరిస్తోందని, బడ్జెట్‌లోనూ ప్రత్యేక కేటాయింపులు చేయడంతోపాటు ప్రాయోజిత పథకాలద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు.

Updated Date - Feb 05 , 2025 | 01:31 AM