జిల్లాలో తగ్గుముఖం
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:29 AM
జిల్లాలో కుష్ఠు వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనిపై ప్రజల్లో కొంత అవగాహన పెరగడం.. సకాలంలో వైద్యం అందడంతో కేసులు తగ్గాయి.

నేడు ప్రపంచ కుష్ఠు నివారణ దినోత్సవం
తిరుపతి(వైద్యం), జనవరి 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కుష్ఠు వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనిపై ప్రజల్లో కొంత అవగాహన పెరగడం.. సకాలంలో వైద్యం అందడంతో కేసులు తగ్గాయి. జిల్లాలో మొత్తం 901 మంది కుష్ఠుతో బాధపడుతున్నారు. వీరిలో 123 కేసులు ఏడాదికాలంలో నిర్వహించిన సర్వేలో వైద్య సిబ్బంది గుర్తించినవి. వీరిలో 48 మంది వ్యాధి తక్కువ(మొదటి దశలో) ఉండగా, 75 మంది పూర్తి లక్షణాలతో ఉన్నట్లు తేలింది. 14 ఏళ్లలోపు ఉన్న 14 మంది చిన్నారుల్లోనూ కుష్ఠువ్యాధి లక్షణాలు ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఎక్కువగా వరదయ్యపాళెం, పిచ్చాటూరు, నారాయణవణం, నాగలాపురం, బుచ్చినాయుడకండ్రిగ, చిన్నపాండూరు వంటి మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో అక్కడ నిరంతరం సర్వే చేస్తూ, విసృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వ వైద్యం, సాయం
2027 నాటికి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకూడదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కుష్ఠు లక్షణాలున్న వారిని సర్వేలో గురిస్తే ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, చికిత్స అందిస్తున్నారు. వేళ్లు వంకర్లు తిరిగిన వారిని పలమనేరు, నెల్లూరు, తమిళనాడులోని కనిగిరిలో ఉన్న ప్రత్యేక ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. దీనికయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించడంతో పాటు సాయంగా రూ.12 వేలనూ అందిస్తోంది. అవసరమైన వారికి ఏడాదికి రెండు జతల ఎంసీఆర్ చెప్పులూ ఇస్తోంది. కుష్ఠు వల్ల అంగవైకల్యం బారిన పడిన 732 మందికి ప్రతి నెలా రూ.6 వేల పింఛను ఇస్తోంది. వచ్చే ఏడాదికి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకూడదనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.