Share News

‘క్రషర్స్‌’లో నలుగుతున్న కుప్పం!

ABN , Publish Date - Feb 22 , 2025 | 01:31 AM

క్వారీ ఒకరిది. నడిపేది మరొకరు. కమీషన్లు వసూలు చేసేది వేరొకరు. వీరందరి మధ్యా నలిగిపోయేది మాత్రం గ్రామీణులు. అవును.. జల్లీ క్రషర్లు, క్వారీల కింద కుప్పం గ్రామీణం నలిగిపోతోంది. ఆ క్వారీలను, క్రషర్లను ఆపేసి తమను, వ్యవసాయ భూమిని, పిల్లలను, ముసలివాళ్లను కాపాడమంటూ అధికారులకు గ్రామీణులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు.

‘క్రషర్స్‌’లో నలుగుతున్న కుప్పం!
ఆవులనత్తం గ్రామ సమీపంలో ఉన్న జల్లీ క్రషింగ్‌ యూనిట్‌

వెల్లువెత్తుతున్న గ్రామీణుల ఫిర్యాదులు

క్వారీ ఒకరిది. నడిపేది మరొకరు. కమీషన్లు వసూలు చేసేది వేరొకరు. వీరందరి మధ్యా నలిగిపోయేది మాత్రం గ్రామీణులు. అవును.. జల్లీ క్రషర్లు, క్వారీల కింద కుప్పం గ్రామీణం నలిగిపోతోంది. ఆ క్వారీలను, క్రషర్లను ఆపేసి తమను, వ్యవసాయ భూమిని, పిల్లలను, ముసలివాళ్లను కాపాడమంటూ అధికారులకు గ్రామీణులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

కుప్పం మండలం ఆవులనత్తం గ్రామ సమీపంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి జల్లీ క్వారీ ఉంది. స్థానిక వైసీపీ నాయకులు ఒకరిద్దరు ఇందులో భాగస్వాములు. వైసీపీ హయాంలో బాగానే నడిచింది కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంచెం క్వారీ ఆపరేషన్లు ఆగాయి. తర్వాత ఏమైందో ఏమోకానీ, నిరాటంకంగా జల్లీ క్వారీ కొనసాగింది. లైసెన్సు ఉన్నందువల్ల క్వారీ నడుపుకోవడానికి ఏ అడ్డంకీ లేకుండా పోయింది. అయితే పరిసర గ్రామాల ప్రజలు ఈ క్వారీవల్ల తమ వ్యవసాయ భూములు నాశనం అవుతున్నాయని, ఇళ్లు పగులుతున్నాయని, ముసలీ ముతకా అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం ప్రారంభించారు. అనుమతులు ఇచ్చిన భూమి పరిధికి మించి క్వారీ విస్తరించడం కూడా దీనికి కారణమైంది. అయితే ప్రస్తుత అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు కొందరు క్వారీకి మద్దతుగా నిలబడి, ఎన్ని అభ్యంతరాలొచ్చినా కొనసాగడానికి సహకరించారు. దీంతో స్థానిక అధికార పార్టీ నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఎక్కువైంది.

వరమనూరులో మరో కథ

కుప్పం మండలం కృష్ణదాసనపల్లె పంచాయతీ పరిధిలోని వరమనూరు గ్రామ సమీపంలో గత వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుడు ఒకరికి జల్లీ క్వారీకోసం లీజు గ్రాంటు అయింది. కొన్ని కార్యకలాపాలు కూడా కొనసాగాయి. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు కార్యకలాపాలు కొనసాగించడం కష్టమైంది. క్రషర్‌ ఏర్పాటుకు అనుమతులకోసం భూగర్భ గనుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ప్రయత్నాల వెనుక అధికార పార్టీకి చెందిన రామకుప్పం మండలం ప్రధాన నాయకుడు ఒకరు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే క్రషర్‌ ఏర్పాటు కాబోతున్నదన్న ప్రచారంతో వరమనూరుతోపాటు పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తారు. ఇప్పటికే ఆవులనత్తం గ్రామ సమీపంలో నడుస్తున్న జల్లీ క్వారీ, క్రషింగ్‌ యూనిట్ల వల్ల గ్రామీణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు వారికి బాగానే తెలుసు. ఈ నేపథ్యంలో వరమనూరు గ్రామస్తులు కుప్పం టీడీపీ కార్యాలయానికి నేరుగా వచ్చి జన నాయకుడు పోర్టల్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. క్రషింగ్‌ యూనిట్‌కు అనుమతి ఇవ్వరాదని, అలా ఇస్తే క్రషర్‌ వల్ల తమ గ్రామానికి, జీవనానికి ముప్పు ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మండలానికి రెండు దిశల్లో ఇప్పటికే ఉన్న జల్లీ ఫ్యాక్టరీ, ఇక రాబోతున్న క్రషర్స్‌ వల్ల గ్రామాలు భయపడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి భద్రతకు, ఆస్తులకు, భూములకు నష్టం వాటిల్లుతుందోనని రైతులు, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై భూగర్భ గనుల శాఖ పలమనేరు ఏడీ బాలసుబ్రహ్మణ్యంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కడా పీడీ సూచన మేరకు ఆవులనత్తం గ్రామం వద్ద నడుస్తున్న జల్లీ ఫ్యాక్టరీలో క్వారీ ఆపరేషన్లను సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. అలాగే వరమనూరు వద్ద క్రషర్‌ ఏర్పాటుకు దరఖాస్తు వచ్చింది కానీ, అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ప్రజల భద్రతకు, వ్యవసాయ భూములకు ముప్పు వాటిల్లే ఏ పర్మిషన్‌ కూడా భవిష్యత్తులో ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Feb 22 , 2025 | 01:31 AM