రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:53 AM
గూడూరు మండలం తిప్పవరపాడు సమీపంలో ఆటో.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు.

గూడూరు అర్బన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గూడూరు మండలం తిప్పవరపాడు సమీపంలో ఆటో.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు. వారి పాప గాయపడ్డారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. సైదాపురం గ్రామానికి చెందిన మునెయ్య (40), జ్యోతి(35) దంపతులు దుస్తుల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గురువారం పాప వైష్ణవితో కలిసి వీరిద్దరూ ద్విచక్ర వాహనంలో గూడూరుకు వచ్చారు. తమ పని చూసుకుని గ్రామానికి వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ఆటో అదుపుతప్పి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మునెయ్య అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన జ్యోతిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరి పాప వైష్ణవికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల మృతితో పాప అనాథగా మారింది. సంఘటనాస్థలాన్ని రూరల్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.