సమన్వయంతో డిన చిక్కుముడి
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:50 AM
తిరుపతి జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన సమస్యలపై కలెక్టర్ డాక్టర్ సంజామల వెంకటేశ్వర్ దృష్టి సారించారు. సంబంధిత అంశాలను లోతుగా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల తరబడి మొదలు కాకుండా, అర్ధంతరంగా ఆగిపోయిన ముఖ్యమైన పెండింగ్ పనులకు సంబంధించిన ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే నాలుగైదు ముఖ్య సమస్యలు పరిష్కారం కాగా మరికొన్ని ఆ దిశగా ముందుకు వెళుతున్నాయి.

తిరుపతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన సమస్యలపై కలెక్టర్ డాక్టర్ సంజామల వెంకటేశ్వర్ దృష్టి సారించారు. సంబంధిత అంశాలను లోతుగా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల తరబడి మొదలు కాకుండా, అర్ధంతరంగా ఆగిపోయిన ముఖ్యమైన పెండింగ్ పనులకు సంబంధించిన ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే నాలుగైదు ముఖ్య సమస్యలు పరిష్కారం కాగా మరికొన్ని ఆ దిశగా ముందుకు వెళుతున్నాయి.
తూకివాకం ఓవర్ బ్రిడ్జికి మోక్షం
రేణిగుంట మండలం తూకివాకం వద్ద పూతలపట్టు-నాయుడుపేట ఆరు వరుసల జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పన్నెండేళ్లుగా సాగుతోంది. ఇరువైపులా విస్తరణ పనులైతే జరిగిపోయాయి కానీ ఓవర్ బ్రిడ్జి మాత్రం కట్టలేదు. దీంతో అక్కడ ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు సంభవిస్తున్నాయి. తిరుపతి మీదుగా చెన్నై, బెంగళూరు, విజయవాడ, కడప తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ మార్గం కీలకం. ఎందుకు ఆగిపోయిందని కలెక్టర్ ఆరా తీస్తే.. ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలు ఆపితేనే బ్రిడ్జి నిర్మాణం సాధ్యం అని తెలిసింది. జాతీయ రహదారుల ఇంజనీరింగ్, రైల్వే అధికారుల నడుమ సమన్వయం, సహకారం లేకపోవడంతో ఇంత చిన్న సమస్య పన్నెండేళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. కలెక్టర్ చొరవ తీసుకుని సమన్వయం కుదిర్చారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. నెలలో పూర్తి కానున్నాయి.
ఏర్పేడు ఆర్వోబీ కదిలింది
తిరుపతి - వెంకటగిరి జాతీయ రహదారిలో ఏర్పేడు సమీపాన రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ మంజూరై ఆరేళ్లవుతోంది. నిర్మాణానికి భూసేకరణ జరిపే క్రమంలో 1.27 ఎకరాల అటవీ భూమి సమస్యగా మారింది. ఆ భూమిని జాతీయ రహదారుల శాఖ పేరిట బదలాయించడానికి అటవీ శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఐదేళ్లుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు కాకుండా పెండింగులో ఉన్నాయి. కలెక్టర్ చొరవతో ఎట్టకేలకు గత నెల 25వ తేదీన అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
రేణిగుంట రైల్వే బైపాస్ ఇక జోరు
రేణిగుంట రైల్వేస్టేషన్‌కు రైల్వే బైపాస్ 2018లో మంజూరైనా పనులు జరగలేదు. కేవలం 2 ఎకరాల భూమి సేకరించే విషయంలో సమస్య ఎదురైంది. కొత్త ట్రాక్ కోసం సేకరించాల్సిన రెండెకరాల భూమిలో ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన 51 కుటుంబాలు నివాసముంటున్నాయి. అందులో షికారీలు కూడా ఉన్నారు. రైల్వే శాఖ పరిహారం మంజూరు చేసినా వారు ఇళ్లు ఖాళీ చేయలేదు. ఆరేళ్లు గడిచిపోయాయి. ఈ అంశాన్ని గత జనవరిలో నారావారిపల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. దీంతో షికారీలకు పరిహారం, అద్దెలకు సంబంధించి రూ.14 కోట్లు సీఎం విడుదల చేయించడంతో సమస్య పరిష్కారమైంది. బైపాస్ వల్ల రేణిగుంటలో ఆగాల్సిన అవసరం లేని రైళ్లు, గూడ్స్‌లు నేరుగా రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. రేణిగుంట స్టేషన్‌లో అనేక రైళ్లు క్రాసింగ్ పేరుతో ఆగిపోవాల్సిన అవసరం తగ్గుతుంది.
కొలిక్కి వచ్చిన పనపాకం ఫ్లైఓవర్
పూతలపట్టు-నాయుడుపేట ఆరు వరుసల జాతీయ రహదారిలో చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రమణప్పగారిపల్లి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉంది. రైతులు పరిహారం పెంచాలని కోరుతూ భూములు అప్పగించలేదు. దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. సుమారు 700 మీటర్ల మేరకు పనులు పెండింగులో పడ్డాయి. ఐదేళ్లుగా సమస్య పరిష్కారం కాలేదు. ఫ్లై ఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉందని తెలియక వాహనాలు వేగంగా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటి దాకా 20 మంది దాకా ప్రమాదాల్లో చనిపోయారు. కలెక్టర్ రమణప్పగారిపల్లి రైతులతో మాట్లాడి వ్యవసాయ భూములు కన్వెర్షన్ చేయించడం ద్వారా ఎక్కువ పరిహారం ఇప్పిస్తామంటూ ఒప్పించారు. దీంతో నిర్మాణం కొలిక్కి వచ్చింది. త్వరలో పనులు మొదలు కానున్నాయి.
సీబీఐసీ భూసేకరణకు పచ్చజెండా
చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం చిల్లకూరు మండలం తమ్మినపట్నం, కోట మండలం కొత్తపట్నం గ్రామాల్లో 985 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లో తాము పంటలు సాగు చేసుకుంటున్నందున తమకు పరిహారం ఇవ్వాలని 600 మంది రైతులు కోరుతున్నారు. పనులు అడ్డుకుంటున్నారు. దీంతో 2016 నుంచి భూముల సేకరణ పెండింగులో పడింది. కలెక్టర్ వెంకటేశ్వర్ చొరవ తీసుకుని ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇప్పించేలా కృషి చేశారు. దీంతో ఆ భూముల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కింద రూ.1,400 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
శెట్టిపల్లి భూములకు త్వరలో పరిష్కారం
తిరుపతి అర్బన్ మండలంలోని శెట్టిపల్లి రెవెన్యూ గ్రామం ఇప్పటి వరకూ రెవెన్యూ పరంగా సెటిల్‌మెంట్ కాలేదు. బ్రిటీష్ పాలన నుంచి కూడా ఇక్కడి భూములు సర్వేకి గానీ, రికార్డుల్లో నమోదుకు గానీ నోచుకోలేదు. దీంతో ఇక్కడ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు గానీ, స్థలాల యజమానులకు గానీ, భవనాల యజమానులకు గానీ వాటిపై ఎలాంటి హక్కులూ లేకుండాపోయాయి. 50 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం కోసం జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా దీనిపై దృష్టి పెట్టిన కలెక్టర్ రైతులు, స్థలాల యజమానులతో సమావేశాలు నిర్వహించి, ఎట్టకేలకు పరిష్కార దిశగా ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. నాలుగు వారాల్లో శెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తిరుమల ఘాట్ రోడ్ల మరమ్మతుపై మల్లగుల్లాలు
త్వరలో నివేదిక సమర్పించనున్న ఐఐటీ నిపుణులు
తిరుమల ఘాట్ రోడ్ల మరమ్మతులపై టీటీడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వాహనాల రద్దీ కారణంగా మరమ్మతులకు పూనుకోవడం ఇబ్బందిగా మారుతోందని చెబుతున్నారు. కొత్త సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తే రాకపోకలకు రెండవ ఘాట్ రోడ్డుపై ఆధారపడాలి. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని భావించి ఆరేడేళ్లుగా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు ఇటీవల ఐఐటీ నిపుణుల బృందాన్ని సంప్రదించారు. కొన్ని రోజుల క్రితం నిపుణులు ఘాట్ రోడ్లను పరిశీలించారు. వారిచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
రోడ్లలో భారీగా పగుళ్లు..
1940లో ఆనాటి మహంతులు మొదటి ఘాట్ రోడ్డు నిర్మించారు. మూడేళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. 1974లో రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగే వరకు మొదటి ఘాట్ రోడ్డులోనే రాకపోకలు జరిగేవి. దీనికి అనుగుణంగానే అప్పటి అధికారులు 55 మలుపులతో నిర్మించారు. కాలానుగుణంగా మట్టిరోడ్డు సీసీ రోడ్డుగా, తారు రోడ్డుగా మారుతూ వచ్చింది. మలుపుల్లో సీసీ రోడ్డు, సాఫీగా ఉన్న చోట తారు రోడ్డు ఉంది. అయితే మలుపుల్లోని సీసీ రోడ్డు పగుళ్లు ఇబ్బందికరంగా మారాయి. చాలాచోట్ల పగుళ్లతో పాటు గుంతలు కూడా ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల వాహనాలు వెళుతుంటే శబ్దాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణం సాఫీగా సాగడంలేదు. టీటీడీ అడపాదడపా పగుళ్లకు తారుపూసి సరిపెడుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.