Share News

రంకేసిన కోడెగిత్తలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:03 AM

చంద్రగిరి మండలం ఎ.రంగంపేట, అరిగిలవారిపల్లె గ్రామాల్లో కనుమ సందర్భంగా బుధవారం జల్లికట్టు నిర్వహించారు.

రంకేసిన కోడెగిత్తలు

చంద్రగిరి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం ఎ.రంగంపేట, అరిగిలవారిపల్లె గ్రామాల్లో కనుమ సందర్భంగా బుధవారం జల్లికట్టు నిర్వహించారు. తమ కోడెగిత్తలు, ఆవులు, దూడల కొమ్ములకు రైతులు రంగులేసి నగదు, విలువైన వస్తు సామగ్రిని, వివిధ రాజకీయ నాయకులు, సినీనటుల ఫొటోలతో కూడిన చెక్క పలకలు కట్టారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎ.రంగంపేట యాదవ వీధిలో గుంపులు, గుంపులుగా వదిలారు. జిల్లా నలుమూలల నుంచీ వేలాదిగా వచ్చిన యువకులు అల్లె అవతల నిలబడ్డారు. రంకెలేస్తూ జోరుగా పరుగు తీసిన కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు. వీటి కొమ్ములకు కట్టిన చెక్కపలకలను, వస్తువులను సొంతం చేసుకునే ప్రయత్నంలో యువకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పశువుల ప్రతిఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. కొందరు ఇళ్లపైభాగాన, చెట్ల కొమ్మలపై నిలబడి తిలకించారు. జల్లికట్టు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరిగిలవారిపల్లెలోనూ జల్లికట్టు ప్రశాంతంగా ముగిసింది. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. జల్లికట్టుకు వేలాది మంది జనం తరలిరావడంతో ఎ.రంగంపేట నుంచి నారావారిపల్లె మీదుగా వెళ్ళే రోడ్డు మార్గం పూర్తిగా స్తంభించింది. ఈ కార్యక్రమంతో ఎ.రంగంపేట, అరిగిలవారిపల్లె గ్రామాలు జనసంద్రమయ్యాయి.

Updated Date - Jan 16 , 2025 | 01:03 AM