Share News

మేయర్‌ దంపతుల హత్య కేసులో చింటూకు బెయిల్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:00 AM

ప్రధాన నిందితుడికి హైకోర్టు కండిషన్‌ బెయిల్‌

మేయర్‌ దంపతుల హత్య కేసులో చింటూకు బెయిల్‌

చిత్తూరు లీగల్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల క్రితం నాటి చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.2015 నవంబరు 17వ తేదీ ఉదయం అప్పట్లో మేయర్‌గా ఉన్న కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వుండగా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి కఠారి అనురాధను తుపాకితో కాల్చగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పక్క ఛాంబర్‌లో ఉన్న ఆమె భర్త కఠారి మోహన్‌ కాల్పుల శబ్దం విని మేయర్‌ ఛాంబర్‌కు పరుగెత్తుకుని రాగా ఆయనపైనా విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి వెళ్లిపోయారు.తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుమారుడు కఠారి ప్రవీణ్‌ తదితరులు చిత్తూరు ప్రభుత్పాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు కొన ఊపిరితో ఉన్న కఠారి మోహన్‌ను మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కూడా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించారు. ఈ జంట హత్యలకు సంబంధించి చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులు చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూతో పాటు మరో 22మందిపై కేసు నమోదు చేశారు, అనంతరం విడతల వారీగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అప్పటికే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై ఉన్న చింటూ మేయర్‌ దంపతుల హత్య కేసులో నవంబరు 30వ తేదీన చిత్తూరు నాలుగవ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు.న్యాయమూర్తి రిమాండ్‌ విధించగా అప్పటి నుంచి చిత్తూరు, కడప జైళ్లలో శిక్షను అనుభవిస్తూ వచ్చిన చింటూ ప్రస్తుతం చిత్తూరు సబ్‌జైల్లో ఉన్నారు.మొత్తం 23 మందిపై కేసు నమోదు చేయగా చింటూ, మంజునాధ్‌, జయప్రకా్‌షరెడ్డి మినహా 20 మందికి హైకోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.మిగిలిన ముగ్గురు నిందితులు బెయిల్‌ కోసం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినా వివిధ కారణాల చేత బెయిల్‌ మంజూరు కాలేదు.ఈ నేపథ్యంలో చింటూకు మాత్రం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తిసుబ్బారెడ్డి పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.చిత్తూరు 4వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌కు రూ. లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించారు. విచారణ నిమిత్తం 6వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టులో హాజరుకావాల్సి ఉన్నప్పుడు మినహా చిత్తూరు పట్టణంలోకి ప్రవేశించడానికి వీల్లేదని, ఎక్కడ ఉంటున్నది, ఫోన్‌ నంబర్‌, లైవ్‌ లొకేషన్‌ వివరాలను చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలకు అందజేయాలన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది డి.పూర్ణచంద్రారెడ్డి వాదనలు వినిపించారు. తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి నిందితుడు చింటూకు బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించారు. ‘దర్యాప్తు అధికారి మినహా సాక్షుల విచారణ పూర్తయ్యింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నాం.’ అని న్యాయమూర్తి జస్టిస్‌ సత్తిసుబ్బారెడ్డి తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 01:00 AM