జన నాయకుడు పోర్టల్‌లో మార్పులు
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:08 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఆవిష్కరించిన జన నాయకుడు పోర్టల్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం నియోజకవర్గానికే పరిమితమైన ప్రజా వినతుల పరిష్కార వేదిక అయిన ఈ పోర్టల్‌ను అవసరాలకు అనుగుణంగా మలచడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది.

టెలికాన్ఫరెన్స్‌లో అధికారుల నుంచి సూచనల స్వీకరణ
కుప్పం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఆవిష్కరించిన జన నాయకుడు పోర్టల్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం నియోజకవర్గానికే పరిమితమైన ప్రజా వినతుల పరిష్కార వేదిక అయిన ఈ పోర్టల్‌ను అవసరాలకు అనుగుణంగా మలచడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎంవో నుంచి అందిన ఆదేశాల మేరకు కడా అధికారులు బుధవారం జిల్లా, డివిజనల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల మొదటివారంలో కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన నాయకుడు పేరుతో పోర్టల్‌ను, ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌ను ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలోనే ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. అప్పట్నుంచీ టీడీపీ కార్యాలయంలో జన నాయకుడు గ్రీవెన్స్ సెల్ విజయవంతంగా సాగుతోంది. ప్రజలనుంచి వచ్చిన వినతులను స్వీకరించి, ఆన్‌లైన్లో నమోదు చేసి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు పరిష్కారంకోసం పంపడంలో చిన్నచిన్న అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రజలనుంచి అందుతున్న కొన్ని సమస్యల పరిష్కారం ఒకేసారి రెండుమూడు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉంటోంది. అయితే ఈ వినతులను జన నాయకుడు పోర్టల్‌లో ఏదో ఒక శాఖ కిందనే నమోదు చేస్తున్న సిబ్బంది, ఆ శాఖాధికారులకే దానిని పంపుతున్నారు. ఉదాహరణకు ఒక గ్రామానికి లేదా ప్రదేశానికి రోడ్డు కావాలని ప్రజలనుంచి వినతులు అందాయనుకుంటే జన నాయకుడు పోర్టల్‌నుంచి నేరుగా పంచాయతీరాజ్ శాఖకు పంపుతున్నారు. అక్కడ రోడ్డు నిర్మించడానికి అనువైన స్థలం సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంటుంది. ఆ తర్వాతే పంచాయతీరాజ్ శాఖ రోడ్డు నిర్మించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రెండు శాఖల సమన్వయంతో జరగాల్ని పనిని కేవలం ఒక శాఖ బాధ్యతగానే నమోదు చేస్తున్నారు. అలాగే తాగునీటి సరఫరాకు సంబంధించిన బోర్లు వేయడం, పైపులైన్లు నిర్మించడం ఆర్‌డబ్ల్యుఎస్ బాధ్యత. కానీ వాటికి మరమ్మతులు అవసరమైనప్పుడు ఆ సమస్యను తీర్చాల్సింది, పంచాయతీరాజ్ శాఖ. అయితే ఈ పైపులైన్ల మరమ్మతులు, బోరు విద్యుత్తు మోటారు మరమ్మతులకోసం వచ్చే వినతులు నేరుగా ఆర్‌డబ్ల్యుఎ్‌సకు వెళ్తున్నాయి. పక్కా ఇల్లు కావాలని ప్రజలనుంచి వినతులు వస్తే, ఆ కాలమ్ పోర్టల్‌లో లేకపోవడంవల్ల ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్ అన్న కాలంలో నమోదు చేస్తున్నారు. తీరా హౌసింగ్ శాఖ అధికారులు, వినతి ఇచ్చిన వారికి ఫోన్ చేశాక సమస్య అది కాదని తేలుతోంది. ఇటువంటి చిన్నచిన్న పొరపాట్లవల్ల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యమవుతోంది. ఇటువంటి పొరపాట్లను, సమస్యలను సీఎంవో గుర్తించింది. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా, ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పోర్టల్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేయాలని సీఎంవోనుంచి కడాకు ఆదేశాలు అందాయి. కడా పీడీ వికాస్ మర్మత్ సూచన మేరకు ప్రాజెక్ట్ మేనేజరు ప్రేమ్‌కుమార్, సీఎం పీఏ దుర్గాప్రసాద్‌తో కలిసి బుధవారం ఉదయం జిల్లా, డివిజనల్ ప్రభుత్వ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు గుర్తించిన సమస్యలను, అదనంగా చేర్చాల్సిన కాలమ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తమకు పంపాలని వారిద్దరూ అధికారులను కోరారు. జన నాయకుడు పోర్టల్‌లో అవసరాలకు అనుగుణంగా మార్పులుచేర్పులు జరిగితే ప్రజా సమస్యలు మరింత వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.