రేణిగుంటకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:50 AM
సీఎం చంద్రబాబు ఆదివారం రేణిగుంటకు వచ్చారు. తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్, తిరుపతి పార్లమెంటరీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు.

నరసింహ యాదవ్ తనయుడి వివాహానికి హాజరు
తిరుపతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఆదివారం రేణిగుంటకు వచ్చారు. తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్, తిరుపతి పార్లమెంటరీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చిన ఆయన.. వధూవరులు సుదర్శన్ యాదవ్, పూజలను ఆశీర్వదించారు. వధూవరుల తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలసి గ్రూపు ఫొటోలు దిగారు. సుమారు అరగంట పాటు ఆయన పెళ్లి మండపంలో గడిపారు. అనంతరం విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. కాగా, ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎంకు పలమనేరు, చంద్రగిరి, నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, డాక్టర్ థామస్, గురజాల జగన్మోహన్, మురళీమోహన్, అనంతపురం డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఘనస్వాగతం పలికారు.
అధినేత రాకతో..
టీడీపీ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్న నరసింహ యాదవ్.. తన కుమారుడి వివాహానికి అధినేత చంద్రబాబు హాజరు కావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తొలినుంచీ ఆయనకు సిన్సియర్ నాయకుడిగా గుర్తింపు ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో తుడా చైర్మన్‌గా నియమించారు. ఎన్నికలకు ముందు నుంచీ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ లేదా టీటీడీ చైర్మన్ పదవిని ఆశించారు. ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వగా.. ఆయన సంతోషంగా లేరు. తాను మరో రెండేళ్లయినా వేచి చూస్తానని, తనకు సముచిత పదవి ఇవ్వాలని అదిష్ఠానాన్ని కోరారు. ఆ మేరకు ఇప్పటికీ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టలేదు. తాజాగా ఆదివారం అధినేత చంద్రబాబు కేవలం నరసింహ యాదవ్ తనయుడి వివాహానికే ప్రత్యేకంగా రావడం.. అరగంట పాటు వారితో గడపారు. ఇలా.. అధినేత తనకిచ్చిన ప్రాధాన్యతకు నరసింహ యాదవ్, ఆయన కుటుంబీకులకు సంతోషం కలిగించింది.