Share News

నేడు తిరుచానూరుకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:41 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జిల్లాకు రానున్నారు. ఏజీ అండ్‌ పి కంపెనీకి సంబంధించి తిరుచానూరులో ఇళ్ళకు పైప్‌లైన్‌ ద్వారా నాచురల్‌ గ్యాస్‌ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

నేడు తిరుచానూరుకు సీఎం చంద్రబాబు

- ఇళ్ళకు పైప్‌ ద్వారా నాచురల్‌ గ్యాస్‌ సరఫరా ప్రారంభం

తిరుపతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జిల్లాకు రానున్నారు. ఏజీ అండ్‌ పి కంపెనీకి సంబంధించి తిరుచానూరులో ఇళ్ళకు పైప్‌లైన్‌ ద్వారా నాచురల్‌ గ్యాస్‌ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ఏజీ అండ్‌ పీ కంపెనీగా పిలిచే అట్లాంటిక్‌ గల్ఫ్‌ అండ్‌ పసిఫిక్‌ కంపెనీ తిరుచానూరు ప్రాంతంలో ఏడాదిగా ఇళ్ళకు వంట గ్యాస్‌ను పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటి వరకూ వంట గ్యాస్‌ లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్పీజీ) రూపంలో సిలిండర్ల ద్వారా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఏజీ అండ్‌ పీ కంపెనీ నాచురల్‌ గ్యాస్‌ను పైప్‌లైన్‌ ద్వారా నేరుగా ఇళ్ళకు సరఫరా చేయనుంది. ఇప్పటి వరకూ సుమారు 2 వేల ఇళ్ళకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ క్రమంలో ఆదివారం ముఖ్యమంత్రి సంబంధిత కంపెనీ ఆహ్వానం మేరకు తిరుచానూరు పంచాయతీ పరిధిలో బనియన్‌ ఫ్యాక్టరీ సమీపంలోని శరవణ అనే వ్యక్తికి చెందిన ఇంటిని సందర్శించి గ్యాస్‌ సరఫరాను ప్రారంభించనున్నారు.అనంతరం హోటల్‌ తాజ్‌కు చేరుకుని అక్కడ ఏజీ అండ్‌ పీ కంపెనీ పరిశ్రమలకు నాచురల్‌ గ్యాస్‌ సరఫరా ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అలాగే అదే సంస్థకు సంబంధించిన సీఎన్‌జీతో నడిచే ద్విచక్ర, మూడు చక్రాల, నాలుగు చక్రాల వాహనాలను, ఎల్‌సీవీలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆపై అక్కడే కంపెనీ ప్రతినిధులతోనూ, అందులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న జపాన్‌ ప్రతినిధుల బృందంతోనూ సమావేశమవుతారు.

నేటినుంచీ 15 వరకూ స్వగ్రామంలోనే సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సాయంత్రం స్వగ్రామమైన నారావారిపల్లి చేరుకుంటారు. శనివారమే ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్వగ్రామం చేరుకుని పలు అభివృద్ధి పనులు పరిశీలించడం, ప్రారంభించడం చేశారు.వీరితో పాటు నందమూరి కుటుంబానికి చెందిన పలువురు కూడా వచ్చే అవకాశముంది. ఆదివారం రాత్రి నుంచీ బుధవారం ఉదయం దాకా వీరంతా గ్రామంలోనే గడపనున్నారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు. కాగా సీఎం చంద్రబాబు నాలుగు రోజుల పాటు జిల్లాలో వుండనున్న నేపధ్యంలో యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఇంఛార్జి ఎస్పీ మణికంఠ, మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య తదితరులు సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jan 12 , 2025 | 01:41 AM