Share News

అవకాశాలు అందిపుచ్చుకుంటే...ఆకాశమే మీ హద్దు!

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:57 AM

మహిళలు అన్ని రంగాల్లో ఆర్ధిక పురోగతి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని, సద్వినియోగం చేసుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని అధికార, అనధికార ప్రముఖులు ఆకాంక్షించారు. శనివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది.

అవకాశాలు అందిపుచ్చుకుంటే...ఆకాశమే మీ హద్దు!
మహిళలకు చెక్కులు అందజేస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే ఆరణి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్‌, కమిషనర్‌ మౌర్యా తదితరులు

తిరుపతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : మహిళలు అన్ని రంగాల్లో ఆర్ధిక పురోగతి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని, సద్వినియోగం చేసుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని అధికార, అనధికార ప్రముఖులు ఆకాంక్షించారు. శనివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, కమిషనర్‌ మౌర్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలు అతిపెద్ద నెట్‌వర్క్‌గా రూపుదిద్దుకొని ప్రపంచ దేశాలు అవలంబించేలా చేసినందుకు గర్వకారణంగా ఉందన్నారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలు ఎక్కువగా రాణిస్తుండడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. వారికి అన్ని రంగాల్లో పురుషులతో సమాన హక్కులు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కమిషనర్‌ మౌర్య మాట్లాడుతూ మహిళలు ఒకరికొకరు సహకరిచుకుంటూ ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌లు మాట్లాడుతూ దివంగత సీఎం ఎన్టీఆర్‌ తొలిసారిగా మహిళా రిజర్వేషన్లు కల్పించి వారి ఎదుగుదలను ప్రోత్సహించారన్నారు. ఆస్తిలోనూ సమాన హక్కు వచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. మహిళల కోసం తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పారని అన్నారు. కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్లు ఆర్సీ మునికృష్ణ, ముద్రగడ నారాయణలు మాట్లాడారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు, పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన, స్వయం సహాయక మహిళలకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. డీఆర్డీఏ నుంచి ఉన్నతి, బ్యాంకు లింకేజీ, పీఎంఏజేఏవై చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, ఏఎస్పీ రవిమనోహరాచారి, స్కిల్‌ డెవలప్మెంట్‌ అధికారి లోకనాథం, మహిళా సంఘాలు, సీడీపీవోలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 12:57 AM