Share News

తిరుపతి సబ్‌ జైల్లోకి గంజాయి!

ABN , Publish Date - Jan 07 , 2025 | 02:17 AM

తిరుపతి సబ్‌జైలులోకీ గంజాయి చేరుతోంది. వాయిదాలకు వచ్చే సమయంలో అధికారుల కళ్లుగప్పి రిమాండ్‌ ఖైదీలు తీసుకెళుతున్న ఘటనలున్నాయి.

తిరుపతి సబ్‌ జైల్లోకి గంజాయి!

తిరుపతి(నేరవిభాగం), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి సబ్‌జైలులోకీ గంజాయి చేరుతోంది. వాయిదాలకు వచ్చే సమయంలో అధికారుల కళ్లుగప్పి రిమాండ్‌ ఖైదీలు తీసుకెళుతున్న ఘటనలున్నాయి. విశాఖ సబ్‌ జైలులో గంజాయి కలకలం రేగిన నేపథ్యంలో తిరుపతి సబ్‌ జైలులోనూ అటు ఇటుగా గంజాయి చేరుతున్నట్లు తెలిసింది. ఇక్కడి సబ్‌ జైలు సామర్థ్యం దాదాపు 120 మందికే. కానీ, ప్రస్తుతం 140 మంది వరకున్నారు. వీరిలో కనీసం 20 నుంచి 30 మంది గంజాయితో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారున్నట్లు తెలిసింది. వీరిలో కొందరిని వాయిదాల కోసం ప్రత్యేక ఎస్కార్టుతో ఇతర జిల్లాల్లోని న్యాయస్థానాలకు తీసుకెళ్లి హాజరుపరుస్తుంటారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న సమయంలో వారి స్నేహితులు, బంధువులు కొందరు వీరితో మాట్లాడేందుకు వస్తుంటారు. ఆ సమయంలో రిజర్వు కానిస్టేబుళ్ల కళ్లుగప్పి గంజాయి పొడిని రిమాండు ఖైదీలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్యాకెట్లను గుట్టుచప్పుడు కాకుండా వీరు బ్యారక్‌లకు తీసుకెళుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. రాత్రిళ్లు వీరు గంజాయి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక, రిమాండ్‌ ఖైదీలకు గంజాయి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కొన్ని బ్యాచ్‌లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్లు ఇక్కడికి తీసుకొచ్చి చేరిస్తే రూ.వెయ్యి ముట్టచెపుతున్నట్లు సమాచారం. తరచూ అధికారులు తనిఖీ చేసి కొన్ని ప్యాకెట్లను గుర్తించి పడేస్తున్నా.. ఇంకొన్ని కనపడకుండా రిమాండ్‌ ఖైదీలు జాగ్రత్త పడుతున్నారు. నెలలో ఐదు నుంచి 10 మంది నుంచి గంజాయి పొడి ప్యాకెట్లు తీసి బయట పడేస్తున్నా.. వారిలో మార్పు రాకపోవడం గమనార్హం. కాగా, రాత్రిళ్లు కొందరు బయట నుంచి.. కొన్ని ఇళ్లపైకి వెళ్లి సబ్‌జైలులోకి గంజాయి పొడి ప్యాకెట్లు విసురుతున్నట్లు సిబ్బంది గుర్తించినట్లు తెలిసింది. ఏమాత్రం అదమరిచినా ప్యాకెట్లు లోపల పడిపోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలా బీడీలను లోపలకు విసిరిన సందర్భాలున్నాయి. వీటిపై ఉన్నత స్థాయి అధ్యయనం చేసి సబ్‌జైలు లోపలకు గంజాయి రాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పాత ఖైదీల పాత్ర ఎక్కువ

సబ్‌జైలులో ఉంటున్న పాత ఖైదీలు కొందరు గంజాయి పొడి ప్యాకెట్లు లోపలకు తీసుకొస్తున్నారు. వాయిదాలకు వెళ్ళి అక్కడ నుంచి ఎస్కార్టు కళ్ళు కప్పి ఏదో ఒక మార్గంలో గంజాయి పొడి తీసుకుంటున్నారు. ఎవరికీ కనిపించని ప్రాంతంలో పెట్టుకుని వస్తున్నారు. వీరిలో ఇప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు. బయట వాయిదాలకు వెళ్ళి జైలులోకి వచ్చే సమయంలో తనిఖీ చేసిన సమయంలో దొరికితే మాత్రం తీసి పడేస్తున్నాం. ఇకపై ఖైదీలను గట్టిగా తనిఖీచేసి లోపలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి ప్యాకెట్లు తీసుకెళ్లకుండా కట్టడి చేస్తాం.

- గురుశేఖర్‌రెడ్డి, తిరుపతి సబ్‌ జైలు పర్యవేక్షణాధికారి

Updated Date - Jan 07 , 2025 | 02:17 AM