Share News

అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాంలో బంగారుపాళ్యంవాసి

ABN , Publish Date - Jan 19 , 2025 | 01:38 AM

సాయమందించిన రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు

 అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాంలో బంగారుపాళ్యంవాసి
అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాంలో బాలకృష్ణ, రామ్‌చరణ్‌తో మల్లేశ్వర్రావు

బంగారుపాళ్యం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : సినీ హీరో రామ్‌ చరణ్‌ ఓ అభిమాని పడుతున్న కష్టాలకు చలించి సాయమందించారు. బంగారుపాళ్యానికి చెందిన ఎంవీడీ మల్లేశ్వర్రావు (స్ర్కీన్‌ నేమ్‌ శంకర మహంతి) పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. భీమిలీ కబడ్డీ జట్టు, దసరా, గామి, నారప్ప, పురుషోత్తముడు తదితర 53 చిత్రాల్లో నటించారు. చిరంజీవి అభిమాని అయిన మల్లేశ్వర్రావు ఆయన స్థాపించిన బ్లడ్‌ బ్యాంక్‌లో మూడు నెలలకోసారి రక్తదానం చేసేవారు. దీంతో బ్లడ్‌ బ్యాంకు వ్యవహారాలను చూసే చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడితో పరిచయం పెరిగింది. మల్లేశ్వర్రావు సతీమణి వెంకటదుర్గ(58) తన భర్తను చూసేందుకు కుటుంబ సమేతంగా 2023 జూలైలో హైదరాబాద్‌ వెళ్ళారు.అక్కడ ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లేశ్వర్రావు అపోలో ఆస్పత్రిలో వైద్యం కోసం చేర్చారు. ఈ విషయం స్వామినాయుడికి తెలియడంతో హీరో రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనకు చెప్పారు. దీంతో చలించిన ఉపాసన వెంటనే అపోలో సిబ్బందికి సమాచారం ఇచ్చి వెంకటదుర్గకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.17 రోజులు ఐసీయూలో వున్న వెంకటదుర్గకు ప్రత్యేక డాక్టర్‌ను నియమించి మెరుగైన సేవలు అందించడంతో ఆమె కోలుకున్నారు. దీనికి కృతజ్ఞతలు తెలిపేందుకు మల్లేశ్వర్రావు అవకాశం కోసం ఎదురు చూశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా హీరో రామ్‌చరణ్‌ వస్తున్న విషయం తెలుసుకుని ఆహా ఓటీటీ ఫ్లాట్‌పాం నిర్వాహకులను మల్లేశ్వర్రావు సంప్రదించారు. వారు అవకాశం కల్పించడంతో తన అభిమాన హీరో చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ను చూసి మల్లేశ్వర్రావు భావోద్వేగానికి గురయ్యారు.ఆయనతో పాటు ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆహా నిర్వాహకులు ఇతర ఖర్చులకు రూ.లక్ష రూపాయల చెక్కును మల్లేశ్వర్రావుకు అందజేశారు.

Updated Date - Jan 19 , 2025 | 01:38 AM