నీటి సమస్య తలెత్తకుండా చూడండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:25 AM
తిరుపతి అర్బన్ జీవకోన ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ నినాదంతో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం జీవకోన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానంగా నీటి సమస్యను స్థానికులు ప్రస్తావించారు.

జీవకోనలో పర్యటించిన కమిషనర్ మౌర్య
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమంలో వినతులకు స్పందన
తిరుపతి (జీవకోన), జనవరి 29(ఆంధ్రజ్యోతి): తిరుపతి అర్బన్ జీవకోన ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ నినాదంతో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం జీవకోన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానంగా నీటి సమస్యను స్థానికులు ప్రస్తావించారు. మరిన్ని సమస్యలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బుధవారం 48, 49 డివిజన్లలో కమిషనరు మౌర్య పర్యటించారు. ప్రతి వీధి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. పలుచోట్ల నీటి సమస్య అధికంగా ఉందని, మరింత మెరుగ్గా పారిశుధ్యం పనులు చేపట్టాలని స్థానికులతో పాటు కార్పొరేటర్లు అన్నా అనిత, అన్నా సంధ్య, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ కోరారు. పలు సమస్యలను ప్రస్తావించారు. కాగా, ప్రధానమైన నీటి సమస్యను అధిగమించేందుకు తక్షణమే బోర్లు, మోటార్ల మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనరు మౌర్య సూచించారు. మురుగునీటి కాలువలకూ మరమ్మతులు, లేనిచోట్ల పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చాలని, తడి పొడిచెత్త వేర్వేరుగా ఇచ్చేలా చూడాలని, బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. కాగా, దెబ్బతిన్న డ్రైన్ల స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని కమిషనరును కలిసి మాజీ సర్పంచి అన్నా రామకృష్ణ కోరారు. బోర్లను మరమ్మతులుచేస్తే నీటి సమస్యను కొంత మేర అధిగమించవచ్చని సూచించారు. మరిన్ని సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎస్‌ఈ శ్యామ్‌సుందర్, ఎంఈ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువఅన్వేష్, అధికారులు రవి, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్మశానాల పరిశీలన
సమస్యల పరిష్కార వేదికలో స్థానికుల నుంచి వచ్చిన వినతి మేరకు రాజీవ్‌గాంధీ కాలనీ వద్ద ఉన్న శ్మశాన వాటికలను కమిషనర్ పరిశీలించారు. శ్మశానాలను శుభ్రంగా ఉంచాలన్నారు. గేటు ఏర్పాటు చేసి ఆకతాయిలు రాకుండా చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు.
మొదలైన రోడ్డు పనులు
తిరుమల బైపా్‌సరోడ్డు నుంచి సత్యనారాయణపురం సర్కిల్‌కు వెళ్లే విరజా మార్గం.. వంద మీటర్ల వరకు అసంపూర్తి ఉంది. దీనివల్ల ప్రజలుపడే ఇబ్బందులపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై కమిషనర్ మౌర్య స్పందిస్తూ మిట్ట ప్రాంతం వద్ద సిమెంటు రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. పనులూ ప్రారంభించారు.