ఫోర్‌లేన్‌గా పలమనేరు- కుప్పం రోడ్డు
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:56 AM
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ జిల్లాలో అనేక జాతీయ, రాష్ట్ర రహదారులు అభివృద్ధి చెందాయి. చిత్తూరు- తిరుపతి, తిరుపతి- నాయుడుపేట ఆరు వరుసలు, తిరుపతి- మదనపల్లె, పూతలపట్టు- పీలేరు, చిత్తూరు- పలమనేరు.. ఇలా అనేక రహదారులు అభివృద్ధి చెందాయి. వీటితోపాటు అప్పట్లో కొత్తగా ఏడు ఆర్వోబీలనూ నిర్మించారు. వైసీపీ ఐదేళ్లపాటు రహదారులను పట్టించుకోని విషయం తెలిసిందే.

-రూ.1,500 కోట్లతో
రహదారి అభివృద్ధికి ప్రణాళిక
-డీపీఆర్ తయారీలో యంత్రాంగం
- మూడు చోట్ల కొత్త బైపా్‌సలు
పలమనేరు- కుప్పం హైవే రెండు నుంచి నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చెందనుంది. సీఎం అయ్యాక గత ఏడాది జూలైలో తొలిసారి కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఈ రహదారి అభివృద్ధి విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అధికారులు డీపీఆర్‌ను తయారు చేస్తున్నారు. అనుగుణంగా సర్వే కూడా జరుగుతోంది.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ జిల్లాలో అనేక జాతీయ, రాష్ట్ర రహదారులు అభివృద్ధి చెందాయి. చిత్తూరు- తిరుపతి, తిరుపతి- నాయుడుపేట ఆరు వరుసలు, తిరుపతి- మదనపల్లె, పూతలపట్టు- పీలేరు, చిత్తూరు- పలమనేరు.. ఇలా అనేక రహదారులు అభివృద్ధి చెందాయి. వీటితోపాటు అప్పట్లో కొత్తగా ఏడు ఆర్వోబీలనూ నిర్మించారు. వైసీపీ ఐదేళ్లపాటు రహదారులను పట్టించుకోని విషయం తెలిసిందే.
మళ్లీ రహదారుల అభివృద్ధిపై దృష్టి
తాజాగా కూటమి ప్రభుత్వం మళ్లీ రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే రూ.22 కోట్లతో రహదారుల మరమ్మతులు చేస్తుండగా.. 70శాతం పనులు పూర్తయ్యాయి. రూ.99 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేస్తుండగా.. అవి కూడా పురోగతిలో ఉన్నాయి. మరోవైపు చిత్తూరు- తచ్చూరు, చెన్నై- బెంగళూరు జాతీయ రహదారుల నిర్మాణ పనులూ వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఒకటి, వచ్చే ఏడాది మరోటి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు తాజాగా, పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు నేషనల్ హైవే(ఎన్‌హెచ్ 42)ను అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది.
84 కిలోమీటర్లు రూ.1,500 కోట్లు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చిత్తూరు సమీప తమిళనాడు సరిహద్దు నుంచి గంగవరం సమీప కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. పలమనేరు నుంచి కుప్పం వరకు రెండు వరుసలుగా అలాగే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు జూలైలో కుప్పంలో పర్యటించినప్పుడు పలమనేరు- కుప్పం రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు మరో 20 కిలోమీటర్ల వరకు సాగే ఈ రహదారిని మొత్తంగా 84 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణతో కలిపి రూ.1,500 కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. డీపీఆర్ పూర్తయ్యాక ఎంత అవుతుందనేది కచ్చితంగా తెలుస్తుంది.
శాంతిపురం, రాజుపేట, కుప్పంలకు బైపా్‌సలు
పలమనేరు - కుప్పం రహదారి అభివృద్ధిలో మూడు చోట్ల బైపా్‌సలను నిర్మించనున్నారు. శాంతిపురం, రాజుపేట, కుప్పం ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మించనుండగా.. బైరెడ్డిపల్లె, వి.కోట ప్రాంతాల్లో బైపాస్ నిర్మాణానికి ఇదివరకే పనులు మంజూరయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణతోపాటు తొమ్మిది కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి రూ.వంద కోట్లను కేటాయించారు. బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తవ్వగా, వి.కోటలో పెండింగులో ఉంది. కాగా, అప్పట్లో ఈ పనులకు జేఎంసీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. అధికారులు భూసేకరణ పూర్తి చేస్తే ఆ సంస్థ పనుల్ని ప్రారంభిస్తుంది.
వి.కోట బైపాస్ మార్పు కోసం స్థానికుల పోరాటం
బైరెడ్డిపల్లె, వి.కోట ప్రాంతాల్లో బైపాస్ నిర్మాణానికి గతంలోనే రూ.వంద కోట్లతో పనులు మంజూర్వగా.. వి.కోటలో బైపాస్ మార్పు కోసం స్థానికులు పోరాటం చేస్తున్నారు. బైపాస్ వి.కోటకు పడమర వైపున వెళ్లనుంది. ఇది కర్ణాటక రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. కానీ, స్థానికులు పట్టణానికి తూర్పు వైపున బైపాస్ కావాలని పోరాడుతున్నారు. ప్రస్తుతమున్న డిజైన్ మేరకు వి.కోటలో బైపాస్ నిర్మించాలంటే కర్ణాటక రాష్ట్రం వాళ్లు కూడా భూసేకరణ చేయాల్సి ఉంది. తూర్పు వైపునకు మార్చితే మన రాష్ట్రంలో నుంచే రోడ్డు వెళ్తుంది. దీంతో స్థానికులు వి.కోట బైపాస్ డిజైన్‌ను మార్చాలని సుమారు ఏడువేల మంది సంతకాలు చేసి.. అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులకు అందించారు. అలాగే నిర్వాసితులతో కలిసి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఇక్కడ పనులు తాత్కాలికంగా ఆగాయి.