సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం!
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:06 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఈనెల 6, 7, 8 తేదీల్లో ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
పర్యటన షెడ్యూల్‌లో కొనసాగుతున్న మార్పు చేర్పులు
కుప్పంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటన
అధికారులకు దిశానిర్దేశం
కుప్పం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఈనెల 6, 7, 8 తేదీల్లో ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్.మునిరత్నంలతో కలసి వారు శనివారం కుప్పం మండలం కంగుంది గ్రామానికి వెళ్లి అక్కడ సీఎం పర్యటనకకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మునిరత్నం తండ్రి పీఆర్.శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్న నేపథ్యంలో కంగుందిలో నూతనంగా రోడ్లు నిర్మిస్తున్నారు. కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్తు లైన్లు మారుస్తున్నారు. అలాగే టీడీపీ కార్యాలయం ముందు భాగాన ఏర్పాటు చేసే వేదిక ద్వారా జన నాయకుడు గ్రీవెన్స్ సెల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిసరాలను కూడా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యటన సజావుగా జరిగేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఫ పర్యటనలో మార్పుచేర్పులు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన తేదీలు ఖరారైనా, మినిట్ టు మినిట్ కార్యక్రమం మాత్రం ఇంకా ప్రభుత్వం అప్రూవ్ చేయలేదు. ఎప్పటికప్పుడు స్వల్పమైన మార్పుచేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతమున్న సమాచారం మేరకు... ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ తేదీన ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. వర్శిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029, నేచురల్ ఫార్మింగ్ విజన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్వర్ణ కుప్పం 2029 పైన చర్చా కార్యక్రమం జరుపుతారు. అక్కడినుంచి అగరం కొత్తపల్లె చేరుకుని స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశమవుతారు. కుప్పం మండలం నడిమూరు గ్రామంలో సోలరైజేషన్ పథకాన్ని ప్రారంభిస్తారు. శీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో సమావేశమవుతారు. తిరిగి ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియం చేరుకుని టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. రాత్రికి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 7వ తేదీ ఉదయం టీడీపీ కార్యాలయం చేరుకుని జన నాయకుడు సెంటర్‌ను ప్రారంభిస్తారు. కార్యాలయం ఎదుట ప్రజలనుంచి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్.మునిరత్నం తండ్రి దివంగత పీఆర్.శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి నేరుగా కుప్పంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం చేరుకుంటారు. ఇక్కడ మదర్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ కంపెనీకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు, శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన డెయిరీకి శంకుస్థాపనలు చేస్తారు. కుప్పం పురపాలక సంఘానికి రూ.92 కోట్లతో మంజూరైన నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. నెట్ జీరో (కాలుష్య రహిత) నియోజకవర్గ ప్రాజెక్ట్ విషయంలో కాన్పూర్ ఐఐటీతో ఎంవోయూ కుదుర్చుకుంటారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి అలిప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఎన్‌డీడీబీ ఛైర్మన్, బిగ్ బాస్కెట్ సీఈవోలు, ఇతర అధికారులు, సీఈవోలతో సమావేశమవుతారు. అనంతరం శాంతిపురం కడపల్లె చేరుకుని సొంత గృహ నిర్మాణాన్ని పరిశీలిస్తారు. తిరిగి ద్రావిడ విశ్వవిద్యాలయం చేరుకుని అకడమిక్ భవనం, కెరీర్ రీడినెస్ సెంటర్ భవనాలను ప్రారంభిస్తారు. అధికారులతో సమావేశమవుతారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ చేరుకుని రాత్రి బస చేస్తారు. 8వ తేదీ ఉదయం ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్ చేరుకుని అమరావతి బయలుదేరి వెళ్తారు.