మేం పనీపాట లేకుండా వస్తున్నామా?
ABN , Publish Date - Feb 23 , 2025 | 02:16 AM
‘మేము పనీపాట లేకుండా సమావేశాలకు వస్తున్నామా? జిల్లా అధికారులకు ఎందుకు రారు? వారికి బాధ్యత లేదా?’ అంటూ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు పలువురు గైర్హాజరయ్యారు. దీంతో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల కింద స్థాయి అధికారులు సమాధానం చెప్పలేక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సమావేశాలకు హాజరవుతున్నా.. వివిధ శాఖల జిల్లా అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. గైర్హాజరైన అధికారుందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జడ్పీ చైర్మన్ చెప్పగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలనీ నిర్ణయించారు.

సమావేశాలకు రాని జిల్లా అధికారులపై జడ్పీ చైర్మన్, సభ్యుల ఆగ్రహం
షోకాజ్ నోటీసులివ్వాలని తీర్మానం
చిత్తూరు రూరల్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘మేము పనీపాట లేకుండా సమావేశాలకు వస్తున్నామా? జిల్లా అధికారులకు ఎందుకు రారు? వారికి బాధ్యత లేదా?’ అంటూ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు పలువురు గైర్హాజరయ్యారు. దీంతో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల కింద స్థాయి అధికారులు సమాధానం చెప్పలేక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సమావేశాలకు హాజరవుతున్నా.. వివిధ శాఖల జిల్లా అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. గైర్హాజరైన అధికారుందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జడ్పీ చైర్మన్ చెప్పగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలనీ నిర్ణయించారు.
కుప్పంలో టీచర్ల తీరుపై ఆందోళన
సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్ల తీరు ఆందోళన కలిగిస్తోందని కుప్పం జడ్పీటీసీ శరవణ అన్నారు. ఆయన మాటల్లోనే.. ‘కుప్పం నియోజకవర్గంలో పనిచేసే సుమారు 100 మందికి పైగానే ప్రభుత్వ టీచర్లు బెంగళూరులో స్థిరపడ్డారు. రోజూ అక్కడినుంచి కుప్పానికి ట్రైన్ ద్వారా వస్తున్నారు. ఈ ట్రైన్ ఉదయం 8.30 గంటలకు కుప్పం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఏదైనా కారణంతో ఆలస్యమైతే తొమ్మిది గంటలు దాటుతుంది. పైగా ట్రైన్ దిగిన వెంటనే టిఫిన్లు తిని.. ఆపై స్కూళ్లకు చేరుకోవాలంటే మరో 45 నిమిషాలకంటే ఎక్కువ సమయమే పడుతుంది. అంటే బడులకు సుమారు 9.45గంటలకు చేరుకుంటున్నారు. సాయంత్రం కూడా స్కూల్ వదిలే సమయం 3.45 గంటలకైతే మధ్యాహ్నం 2.45 గంటలకే బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కుప్పం నుంచి బెంగళూరుకు మధ్యాహ్నం 3.15 గంటలకు ప్యాసింజర్ రైలు ఉంది. ఈ రైలు ఎక్కాలంటే సుమారు అరగంట ముందు స్కూల్ నుంచి బయల్దేరాలి’ అని వివరించారు. మరికొందరు ఉపాధ్యాయులైతే ఒకేచోట పదేళ్లకుపైగా పాతుకుపోయి రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలు చేస్తూ పాఠశాలలకు వెళ్లడం లేదని, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని డీఈవోను జడ్పీ చైర్మన్ ఆదేశించారు.
గుంతలను కూడా సరిగా పూడ్చరా?
‘ఆర్‌అండ్‌బీ రోడ్లు చాలావరకు గుంతలుపడి ప్రమాదకరంగా మారాయి. కొత్త రోడ్లు వేయాలని కోరితే గుంతలు పూడ్చి చేతులు దులుకున్నారు’ అని జడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు. ప్యాచ్ వర్కులు కూడా సరిగా చేయక పోవడంతో జనం ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగిపోయాయని, పట్టించుకోకపోతే ఎలా అని అధికారులను చైర్మన్ ప్రశ్నించారు. కుప్పం మండలం నుంచి తమిళనాడుకు కలప అక్రమంగా రవాణా సాగుతోందని సభ్యులు తెలిపారు. నరికేస్తున్న చెట్లలో ఎక్కువగా ఆర్‌అండ్‌బీకి చెందినవే ఉన్నాయన్నారు. శనివారం ఉదయం కూడా పీఈఎస్ కళాశాల ఎదుట రోడ్డుపై ఉన్న చెట్లను నరికేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని కుప్పం జడ్పీటీసీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డిప్యూటీ సీఈవో జుబేద, వైస్ చైర్మన్లు ధనంజయ్‌రెడ్డి, రమ్య, స్టాండిం గ్ కమిటీ చైర్మన్ భారతి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవోలు కనీస మర్యాద ఇవ్వడం లేదు
జిల్లాలో ఏ ఎంపీడీవో కూడా జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని సభ్యులందరూ జడ్పీ చైర్మన్, సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. సమావేశాలకు పిలవడం మానేశారని చెప్పారు. అధికారుల తీరుపై సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తే ప్రభుత్వానికి, జడ్పీ చైర్మన్, సీఈవోకే అవమానమని ఊరుకుంటున్నామన్నారు. ఇక మండలాల్లో ఎమ్మెల్యేల గ్రాంటు ద్వారా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారని.. బోర్ల మరమ్మతులు, ట్యాంకులు శుభ్రం చేయడం వంటి చిన్న పనులను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎందుకు చేయడం లేదని ఎస్‌ఈని ప్రశ్నించారు. వేసవి మొదలైందని జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.