మరి ఇవేంటి బాసూ?
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:18 AM
‘‘తిరుతిలో ఇంత అరాచకం ఎన్నడైనా చూశామా? రౌడీయిజంతో, దౌర్జన్యంతో.. ఇదీ ఒక గెలుపేనా? ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది’’ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ రౌడీయిజాన్ని గుర్తు చేసుకుంటున్న జనం
తిరుపతి- ఆంధ్రజ్యోతి
‘‘తిరుతిలో ఇంత అరాచకం ఎన్నడైనా చూశామా? రౌడీయిజంతో, దౌర్జన్యంతో.. ఇదీ ఒక గెలుపేనా? ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది’’ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత బదులు తీర్చుకుంటామని బెదిరిస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలోని వైసీపీ నాయకుల తీరు ఇప్పుడొక చర్చగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. వీరు చేసిందేమిటి.. అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దొంగ ఓట్ల దండుతో, దౌర్జన్యాలతో, దాడులతో, బెదిరింపులతో గతంలో జరిగిన ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. ఏకంగా ఎన్నికల అధికారి కంప్యూటర్‌లోకే చొరబడి నకిలీ ఓటరు కార్డులు తయారు చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘమే తప్పు పట్టిన వైనాన్ని జనం మరచిపోలేదు. తిరుపతి ప్రశాంత చరిత్రకే మాయని మచ్చను మిగిల్చిన ఘనులు.. ఇప్పుడిలా నీతి వాక్యాలు వల్లిస్తున్నారేమిటా అని ఆశ్చర్యపోతున్నారు. రౌడీయిజమే రాజకీయమనేలా ప్రవర్తించిన వారే ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం విచిత్రమని ప్రజలు వ్యాఖ్యానిస్తూ.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి జగనన్న పాలనలో జరిగిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తంతును ఇలా గుర్తు చేసుకుంటున్నారు...
13 మార్చి 2020 తిరుపతి మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌కు ఆఖరి తేది..
నామినేషన్లు వేసేందకు వచ్చిన టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, నామినేషన్లను చించివేయడం, చొక్కాలు పట్టుకుని లాగి పడేయడం, బూతులు తిట్టడం.. వెనక్కి పంపడం... వంటివి పోలీసుల సాక్షిగానే అడ్డూ అదుపూ లేకుండా జరిగాయి. అంతకు ముందే ఇవే చర్యలతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు గాను 22 ఏకగ్రీవాలు చేసుకున్నారు. 27 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఫోర్జరీ సంతకం వివాదం కారణంగా ఎస్‌ఈసీ ఆదేశం మేరకు 7వ డివిజన్లో ఎన్నిక ఆగిపోయింది. అప్పుడు జరిగిన పరిణామాలు ఇవీ...
సుగుణమ్మపై బూతుల దండకం
తిరుపతి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ముగింపు రోజున మాజీ ఎమ్మెల్యే సుగుణ మ్మ కార్పొరేషన్ కార్యాలయం లోపలికి వస్తుండగా పూటుగా మద్యం సేవించిన ఓ వైసీపీ మద్దతుదారుడు అటకాయించాడు. దుర్భాషలాడారు. అభ్యర్థి మన్నెం శ్రీనివాసులను నోటికొచ్చినట్టు తిట్టి మెడపట్టి బయటకు తోసేశాడు. పాపం... పోలీసులు మాత్రం సినిమా చూస్తున్నట్టు ఉండిపోయారు.
అభినయ్ ఏకగ్రీవం కోసం..
వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ 4వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. టీడీపీ తరపున వేణు, అరుణలను పోటీలో నిలపాలని ఆ పార్టీ భావించింది. తమతో ఎవ్వరినీ కలవనీయకుండా ఫోన్లు తీసిపెట్టుకుని పక్కాగా స్కెచ్ వేసుకున్నారని టీడీపీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.
గేటు బయటకు తోసేశారు
16వ వార్డుకు నామినేషన్‌వేసేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి ఆనంద్‌బాబు యాదవ్‌ను వైసీపీ అభ్యర్థి మోహన్ కృష్ణ యాదవ్, అతని సహచరుడు నవీన్‌లు నామినేషన్‌వేయకుండా అడ్డుకున్నారు. షర్ట్ కాలర్ పట్టుకుని గేటు బయటకు నెట్టివేశారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారు.
స్వతంత్రలనూ వదల్లేదు
41వ వార్డుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన టీటీడీ ఉద్యోగుల సంఘం నేత వెంకటేష్ భార్య చంద్రికను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చింపి బయటకు పంపారు. దీంతో చంద్రికకు మద్దతుగా సీఐటీయూ నాయకుడు కందారపు మురళి సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అదేవిధంగా 38వ వార్డుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన దళిత అభ్యర్థి విల్సన్ నామినేషన్ పత్రాలను వైసీపీ నాయకులు చించి తరిమేశారు. దీంతో దిక్కుతోచని విల్సన్ అంబేద్కర్ భవనం వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు.
బీజేపీ అభ్యర్థిని కిందపడేసి కొట్టి..
బీజేపీ అభ్యర్థిగా సీఎన్ శరవణ 10వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు అతడిని కిందపడదోసి నామినేషన్ పత్రాలతో పాటు మొబైల్ ఫోన్, ఏటీఎం లాక్కున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఎస్పీకి శరవణ మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోవడంతో ఆయన నిస్పృహతో వెనుతిరిగారు.
20 నిమిషాలకు ముందే..
మరో 20 నిమిషాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుండగా వైసీపీ మద్దతుదారు ఒకరు నగరపాలక కార్యాలయం గేటు మూసివేశాడు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిని లోనికి అనుమతించలేదు. దీంతో నామినేషన్ వేసేందుకు వచ్చినవారు వెనుతిరగాల్సి వచ్చింది.
గడువు దాటేలా పన్నాగం
పోస్టల్ కాలనీలోని సచివాలయ కేంద్రంలో వైసీపీ నాయకులు ముందస్తుగా ఓ 50మంది డమ్మీ అభ్యర్థులను క్యూలో నిలబెట్టిరు. నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆర్కే విమలను సమయం అయ్యేవరకు నిలబెట్టారు. సమయం దాటిపోవడంతో బాధతో నామినేషన్ పత్రాలు చించేసి అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రపోజర్స్‌ను వదలని వైనం
45వ డివిజన్‌లో నామినేషన్ వేసేందుకు టీడీపీ అభ్యర్థి చంద్రమోహన్‌కు ప్రపోజర్‌గా ఉన్న గోళ్ల లోకేష్ నాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. తిరుమల బైపాస్‌రోడ్డులోని అతని టీ స్టాల్‌ను ధ్వంసం చేశారు.
టీ దుకాణాన్ని తొలగించారు
టీడీపీ నేత ఆర్పీ శ్రీనివాస్ భార్య ఆర్పీ లక్ష్మీదేవి 43వ డివిజన్ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఆమె టీ దుకాణాన్ని వైసీపీ నేతలు కార్పొరేషన్ అధికారులను అడ్డుపెట్టుకుని తొలిగించారు. వారి జీవనాధారాన్ని కోల్పోయేలా చేశారు.
ఏకంగా ఫోర్జరీకే తెగించారు
టీడీపీకి చెందిన పెరుమాళ్ మధు భార్య విజయలక్ష్యి 7వ వార్డునుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్ని చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమె ఉపసంహరించుకున్నారని అధికారి ప్రకటించారు. తన సంతకాన్ని మురళీ అనే వ్యకి ్తఫోర్జరీ చేసి నామినేషన్‌ను విత్‌డ్రా చేశారంటూ అభ్యర్థి ఎన్నికల అధికారులను నిలదీశారు. తమకు న్యాయం జరగకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో 7వ వార్డు ఎన్నిక ఆగిపోయింది. విచారణ అనంతరం అది ఫోర్జరీ సంతకమని కూడా ఫోరెన్సిక్ తేల్చింది.