ఇక వాటర్ గ్రిడ్
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:51 AM
ప్రతి ఇంటికీ మంచి నీటి కొళాయితో పాటు రోజుకు తలసరి 55 లీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్‌ను కేంద్రం అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం దీన్ని సరిగా అమలు చేయలేకపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం జల్‌జీవన్ పథకానికి జీవం పోసేలా చర్యలు తీసుకుంటోంది.

కండలేరు, గండికోట రిజర్వాయర్ల నుంచి జిల్లాకు నీళ్లు
రూ.8 వేల కోట్లతో రెండు దశల్లో ప్రణాళిక
చిత్తూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ మంచి నీటి కొళాయితో పాటు రోజుకు తలసరి 55 లీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్‌ను కేంద్రం అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం దీన్ని సరిగా అమలు చేయలేకపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం జల్‌జీవన్ పథకానికి జీవం పోసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రారంభం కాని పనుల్ని రద్దు చేసి కొత్త ప్రతిపాదనలతో పనుల్ని చేపట్టనుంది.
పదేళ్లక్రితం ప్లాన్ చేసినా....
వంద ట్యాంకర్లతో నీళ్లను సరఫరా చేసినా ప్రజల అవసరాలు ఏ మాత్రం తీరేవి కావు. ఈ గండం నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో 2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.4375 కోట్లతో టెండరు ప్రక్రియ పూర్తయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వెంటనే పనుల్ని రద్దు చేసి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికే పథకాన్ని పరిమితం చేసింది. 2022 చివరి నాటికి దీన్ని పూర్తి చేస్తామని ప్రకటించినా, సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించిన డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు.
జల్‌జీవన్ మిషన్ పనుల ఆపివేత
జిల్లాలో 3,17,818 ఇళ్లుండగా.. 2,67,272 ఇళ్లకు కొళాయి కనెక్షన్లున్నాయి. మిగిలిన 50,546 ఇళ్లకు జల్‌జీవన్ మిషన్ కింద కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వైసీపీ హయాంలో ప్రారంభమైంది. అప్పట్లో రూ.431.45 కోట్ల విలువైన 5041 పనులు మంజూరవగా.. రూ.101.20 కోట్ల ఖర్చుతో 2432 పనుల్ని పూర్తి చేయగలిగారు. మిగిలిన పనులతో పాటు ఆ విధానాన్నీ కూటమి ప్రభుత్వం రద్దు చేసేసింది.
గ్రౌండ్ వాటర్‌కు బదులు సర్ఫేర్ వాటర్ విధానం..
వైసీపీ హయాంలో ఆయా గ్రామాల్లో నిర్మించే ఓవర్‌హెడ్ ట్యాంకులకు బోర్ల (గ్రౌండ్ వాటర్) ద్వారా నీరందించాలనుకుని పనులు ప్రారంభించగా.. కూటమి ప్రభుత్వం సర్ఫేర్ వాటర్ (రిజర్వాయర్ల నుంచి) నీళ్లను ఇళ్లకు సరఫరా చేసేందుకు కొత్తగా ప్లాన్ చేసింది. అంతేకాకుండా, కొళాయి కనెక్షన్లు లేని 50 వేల ఇళ్లకే కాకుండా జిల్లాలో 3.17 లక్షల ఇళ్లకూ రిజర్వాయర్ల నీళ్లు వెళ్లేలా కనెక్షన్ ఇవ్వనున్నారు.
31 మండలాలూ కవరయ్యేలా...
నెల్లూరు జిల్లా రాపూరులోని కండలేరు రిజర్వాయర్ నుంచి నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు తాగునీరందించేలా ప్రతిపాదించారు. ఈ నియోజకవర్గాల్లోని 10.17 లక్షలమంది దాహార్తి తీర్చేందుకు 0.85 టీఎంసీలు కేటాయించనున్నారు. అలాగే, కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు నీళ్లను తేనున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లోని 10.95 లక్షల మందికి 0.91 టీఎంసీలు అవసరం. ఆయా రిజర్వాయర్ల నుంచి నేరుగా ఇళ్లకు నీళ్లు రానున్నాయి.
తిరుపతి ఐఐటీ, గుర్రంకొండ వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్లు
కండలేరు నుంచి రానున్న నీళ్లను తిరుపతి ఐఐటీ వద్ద, గండికోట నుంచి రానున్న నీళ్లను గుర్రంకొండ వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ది చేయనున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఇళ్లకు పంపించేస్తారు. ఈ డిజైన్‌లో ఎక్కడా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉండవు.
తొలి విడతలో రూ.2,370 కోట్ల కేటాయింపు
కండలేరు, గండికోట నుంచి జిల్లాకు తాగునీటిని తెచ్చేందుకు రూ.8 వేల కోట్లను కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తొలివిడతలో గండికోట నుంచి మదనపల్లె వరకు నీళ్లను తేనుండగా, దీనికోసం రూ.2,370 కోట్లతో టెండర్లను పిలిచారు. వచ్చే నెల 7వ తేదీన టెండర్ తెరవనున్నారు. రెండో విడతలో కుప్పం వరకు నీళ్లు రానున్నాయి. రెండో దశ పనులపై కూడా త్వరలో దృష్టి పెట్టొచ్చు. 2058వ సంవత్సరం వరకు ఈ కనెక్షన్లు ఉండేలా పనులు చేస్తుండగా.. ఆ తర్వాత కూడా స్వల్ప మరమ్మతులు చేసుకుని కొనసాగించుకోవచ్చని చెబుతున్నారు.