Share News

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

ABN , Publish Date - Jan 20 , 2025 | 01:24 AM

పలమనేరు సమీపంలో ఈనెల 13వ తేదీన జరిగిన శివకుమార్‌(40) హత్య కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిందితుడిని అరెస్టు చూపుతూ మీడియాకు వివరాలు తెలిపారు. పలమనేరు మండలం ముసలిమడుగుకు చెందిన శివకుమార్‌ భార్య ఉషారాణి గడ్డూరు క్రాస్‌లోని ఛార్మినార్‌ బిరియాని సెంటర్‌ నిర్వాహకుడు షామీర్‌ వద్ద ఎనిమిది నెలలుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఉషారాణితో షామీర్‌.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్తకు విషయం తెలియడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో షామీర్‌ గత నెల మూడో తేదీన ఉషారాణిని బెంగళూరుకు తీసుకెళ్లాడు.

వివాహేతర సంబంధమే హత్యకు కారణం


.. వారం రోజుల్లోనే ఛేదించిన పోలీసులు

పలమనేరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పలమనేరు సమీపంలో ఈనెల 13వ తేదీన జరిగిన శివకుమార్‌(40) హత్య కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిందితుడిని అరెస్టు చూపుతూ మీడియాకు వివరాలు తెలిపారు. పలమనేరు మండలం ముసలిమడుగుకు చెందిన శివకుమార్‌ భార్య ఉషారాణి గడ్డూరు క్రాస్‌లోని ఛార్మినార్‌ బిరియాని సెంటర్‌ నిర్వాహకుడు షామీర్‌ వద్ద ఎనిమిది నెలలుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఉషారాణితో షామీర్‌.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్తకు విషయం తెలియడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో షామీర్‌ గత నెల మూడో తేదీన ఉషారాణిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఇది తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శివకుమార్‌ సిద్ధపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు వస్తాయని ఉషారాణిని ఆమె పుట్టినిల్లు అయిన తమిళనాడులోని వేలూరు సమీపం సదువాని గ్రామానికి పంపేశాడు. తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడి ఉషారాణిని భర్తతో ముసలిమడుగుకు పంపారు. ఈ నేపథ్యంలో ఉషారాణిని ఇకపై కలుసుకోనని శివకుమార్‌ను షామీర్‌ నమ్మించాడు. సన్నిహితంగా మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన పలమనేరు పొలిమేరల్లోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వెనుక వైపునకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న శివకుమార్‌పై ఓ బండరాయి వేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పలమనేరులోనే ఉంటే పోలీసులు పట్టుకుంటారని భావించిన షామీర్‌.. బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఈ హత్య కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు బంగారుపాళ్యం సమీపంలోని ఫ్లైఓవర్‌ వద్ద ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో పలమనేరు సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో వెళ్లి షామీర్‌ను అరెస్టు చేశారు. ఈ సమావేశంలో పలమనేరు ఎస్‌ఐ స్వర్ణతేజ పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 01:24 AM