తగ్గిన ‘స్థిరాస్తి’ రిజిస్ర్టేషన్ల జోరు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:55 AM
లక్ష్యంలో పూర్తయ్యింది 70.98శాతం మాత్రమే మిగిలిందిక రెండు నెలలే హైరానా పడుతున్న అధికారులు

చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): స్థిరాస్తి రిజిస్ర్టేషన్ల జోరు తగ్గడంతో రిజిస్ర్టేషన్ల శాఖ లక్ష్యంలో ఇప్పటి వరకు 2024-25 ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 70.98శాతం మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన రెండు (ఫిబ్రవరి, మార్చి) నెలల్లో 29శాతం రాబడి వస్తుందో లేదోనని అధికారులు హైరానా పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో స్థిరాస్తి వ్యాపారం కుదేలయ్యింది. మరోవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు విపరీతంగా పెరగడం వల్ల చాలామంది ఒప్పందాలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇటీవల తనఖా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో కొంత ఆదాయం వస్తోంది.
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల వారీగా..
జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు(ఎ్‌సఆర్‌లు) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఈసారి పెద్దగా లక్ష్యాలు నమోదు కాలేదు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాబడి లక్ష్యం రూ.221.88 కోట్లుగా నిర్దేశించింది. జనవరినాటికి రూ.177.50 కోట్ల లక్ష్యంలో రూ.125.99 కోట్లు మాత్రమే (70.98శాతం) వసూలైంది. ఎస్‌ఆర్‌లవారీగా.. అత్యధికంగా కార్వేటినగరంలో 81.26శాతం, పలమనేరులో 79.42 శాతం, చిత్తూరు ఆర్వోలో 73.42 శాతం కలెక్షన్లతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. బంగారుపాళ్యం అతితక్కువగా 58.35శాతం మాత్రమే సాధించింది. పలు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో స్థిరాస్తుల క్రయవిక్రయాలు తగ్గుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.