CM Chandrababu Amaravati: అమరావతికి ఆహ్వానం
ABN , Publish Date - May 31 , 2025 | 04:30 AM
అమరావతిని గ్లోబల్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం చంద్రబాబు, పారిశ్రామికవేత్తలను భారీగా పెట్టుబడులకు ఆహ్వానించారు. సీఐఐ సదస్సులో 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ లీడర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం: చంద్రబాబు
రొటీన్ బిజినె్‌సలు వద్దు. ‘థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ.. బిజినెస్ గ్లోబల్లీ’ అనేది మన విధానం కావాలి.
నేడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్‌కు చైనా, అమెరికాల నుంచి నిజమైన పోటీ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలి.
ప్రస్తుతం ఐటీ, ఇతర మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలను అందుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నాం. దీనిని అధిగమిస్తే మనల్ని ఎవరూ అందుకోలేరు.
- సీఎం చంద్రబాబు
గ్లోబల్ లీడర్‌షిప్ కేంద్రమూ పెడుతున్నాం
పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి
వచ్చే జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం
టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ భాగస్వాములు
వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు
15 శాతం వృద్ధి రేటే మా లక్ష్యం
తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్
గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన టార్గెట్
సీమలో హైటెక్ పారిశ్రామిక కారిడార్
అనకాపల్లిలో రూ.1.43 లక్షల కోట్లతో ఆర్సెల్లార్ స్టీల్ ప్లాంట్
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ
గూగుల్‌తోనూ చర్చలు జరుపుతున్నాం
మూడేళ్లలో అమరావతి మొదటి దశ పూర్తి
ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు
రొటీన్ బిజినె్‌సలు వద్దు
ఢిల్లీ సీఐఐ ప్లీనరీలో చంద్రబాబు వెల్లడి
న్యూఢిల్లీ, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన నాకు ఇప్పుడు అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. గ్లోబల్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలె్‌సలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక వ్యాపార సదస్సు-2025లో ’ఆర్థికాభివృద్ధి-సుస్థిరత- ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’ అనే అంశంపై జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాను వారికి వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్‌ను సాకారం చేసేందుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. 2026 జనవరి నాటికి భారత్‌లో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని అమరావతిలో నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. ఇందులో టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. భావి నేతలకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో అమరావతిలోనే గ్లోబల్ లీడర్‌షిప్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసీఈ)-2024 విధానం కింద గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

రాయలసీమలో ఏడాదికి రూ.5 లక్షల కోట్లను ఆకర్షించే హైటెక్ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పరుస్తున్నామని చెప్పారు. ఐటీ పరిజ్ఞానం క్రమంగా పరిపక్వమవుతూ నేడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సీసీటీవీ, డ్రోన్ల యుగానికి చేరుకున్నామని, రియల్ టైం డేటాను సమర్థంగా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. బిల్ మిలిందా గేట్స్ సహకారంతో కుప్పంలో ఆరోగ్య సంరక్షణలో ఏఐని వినియోగిస్తున్నామని చెప్పారు. తనను అన్యాయంగా జైలుపాల్జేసినప్పుడు 80 దేశాల్లో సాంకేతిక వృత్తినిపుణులు నిరసన తెలిపారని ప్రస్తావించారు. ప్రపంచంలో భారత్‌ను ఆర్థిక శక్తిగా రూపుదిద్దేందుకు ప్రధాని మోదీ కృషిని.. తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మీరూ వచ్చి చేరండి..
అనకాపల్లిలో రూ.1.43 లక్షల కోట్లతో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖపట్నంలో టీసీఎస్ వంటివి రాబోతున్నాయని సీఎం తెలిపారు. ‘శ్రీసిటీలో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ భారీఎత్తున పెట్టబడులు పెడుతోంది. గూగుల్ వంటి ప్రఖ్యాత సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నాం. గ్రీన్‌ఎనర్జీలో భాగంగా విశాఖలో ఎన్టీపీసీ-ఎన్ రెడ్‌క్యాప్ రూ.1.85 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుచేస్తున్నాం. లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు హైటెక్ పారిశ్రామిక కారిడార్‌ను నెలకొల్పుతున్నాం. రక్షణ, ఉపగ్రహాలు, ఆటోమొబైళ్ల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాం. రేవులు, విమానాశయ్రాలు, జలమార్గాలు, రహదారులను అనుసంధానం చేస్తున్నాం. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో పాటు ప్రజల భాగస్వామ్యాన్నీ నెలకొల్పుతున్నాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రాలు, పారిశ్రామిక పార్కులను ఏర్పరుస్తున్నాం. అరకు కాఫీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లను ప్రోత్సహిస్తున్నాం. రాజధాని అమరావతి మొదటి దశను మూడేళ్లలోపే పూర్తిచేసి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తాం. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నాం. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు చేస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించడమే మా లక్ష్యం. తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్’ అని వివరించారు.
మంచి విధానాలుంటే తిరుగులేదు..
పాలనలో అత్యుత్తమ విధానాలు అవసరమని.. మంచి విధానాలు ఉంటే భారత్‌ను ఎవరూ చేరుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఉత్పత్తుల నాణ్యతపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో మన పరిశ్రమలు, ఐటీ ఉత్పత్తులు ఉంటేనే రాణించగలం. గతంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరుంది. ఇప్పుడు భారత ప్రజలంటేనే ఎంటర్‌ప్రెన్యూర్ అనే పేరు వచ్చింది. సంపద సృష్టిలో స్టార్టప్ కంపెనీలు కీలకం. దీనికి అనుగుణంగా ఏపీలో విధానాలను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.
వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ..
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సమావేశంలో పలువురు అడిగారు. వారి ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు. ‘నైపుణ్యమున్న మానవ వనరులు మనకు చాలా అవసరం. నైపుణ్యాభివృద్థి కోసం ఏపీలోనూ కొన్ని ఉత్తమ విద్యాసంస్థలు వస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) కాలంలో స్మార్ట్ వర్క్ అనేదే కీలకం. బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో ఆరోగ్యం, వ్యవసాయంలాంటి అంశాలపై పనిచేస్తున్నాం. సాంకేతికత ఉంటేనే సరిపోదు దానిని క్షేత్రస్థాయిలో అమలుపరిస్తేనే ఫలితాలు వస్తాయి. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ లాంటివారి నుంచి ఆలోచనలను తీసుకుని నైపుణ్యాభివృద్థి చేస్తున్నాం. సముద్రంలోకి వృధాగా పోయే 2 వేల టీఎంసీల నీటి నుంచి 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకునేలా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తలపెట్టాం. వంశధార నుంచి పెన్నా వరకూ నదుల అనుసంధానం చేయాలని సంకల్పించాం. పర్యాటక రంగంలో వచ్చే ఐదేళ్లలో 50 వేల హోటల్ గదులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతిలో వివిధ నిర్మాణాలు జరగాల్సి ఉంది. పీ-4-జీరో పావర్టీ వంటి కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. చంద్రబాబు ప్రసంగం పూర్తికాగానే పారిశ్రామికవేత్తలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పూరి ఆయన్ను సత్కరించారు.
నేడు కోనసీమకు సీఎం
అమలాపురం, మే 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృతస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసింది. శనివారం ఉదయం చంద్రబాబు నేరుగా ఉండవల్లిలోని స్వగృహం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11.45 గంటలకు ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరకుంటారు. సీహెచ్ గున్నేపల్లి, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో సుమారు ఐదు గంటలపాటు పాల్గొంటారు. సాయంత్రం బయలుదేరి ఉండవల్లికి హెలికాఫ్టర్‌లో వెళ్తారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News