Share News

Chandrababu : రెండు మెట్రోలకు వంద శాతం సాయం

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:22 AM

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను సీఎం చంద్రబాబు కోరారు.

Chandrababu : రెండు మెట్రోలకు వంద శాతం సాయం

  • కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం చంద్రబాబు వినతి

న్యూఢిల్లీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను సీఎం చంద్రబాబు కోరారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ వినతిపత్రం అందించారు. గురువారం ఢిల్లీలోని ఖట్టర్‌ నివాసంలో చంద్రబాబు కేంద్ర మంత్రిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఎంతో కీలకమని వివరించారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, వంద శాతం ఆర్థిక సాయం అందించాలని కోరారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖలో ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తవుతుందని, అప్పటిలోగా మెట్రో కారిడార్‌ను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ఎంతో అవసరమని తెలిపారు. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యమని చెప్పారు. తర్వాత విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజధాని అమరావతికి గేట్‌ వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ కనెక్టివిటీతో బలోపేతం చేయాలని నిర్ణయించామని వివరించారు. విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు ఇది ఎంతో అవసరమని చెప్పారు. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని కోరారు. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదన్నారు. సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్‌ చేసేందుకు ఫేజ్‌-1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండు మెట్రో ప్రాజెక్టులతో వాయు కాలుష్యం తగ్గుతుందని, ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు వివరించారు.

Updated Date - Mar 07 , 2025 | 04:22 AM