Share News

Chandrababu Delhi Visit: హస్తిన చేరిన చంద్రబాబు

ABN , Publish Date - May 23 , 2025 | 04:59 AM

రాష్ట్రాభివృద్ధి, ప్రాజెక్టుల అమలుకు కేంద్ర మద్దతు కోరేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశాలు జరగనున్నాయి.

Chandrababu Delhi Visit: హస్తిన చేరిన చంద్రబాబు

  • నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీలు

  • రాష్ట్రాభివృద్ధికి సాయం కోరనున్న సీఎం

  • రేపు నీతి ఆయోగ్‌ కౌన్సిల్‌ భేటీకి హాజరు

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్రప్రభుత్వం మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడే ఉంటారు. సీనియర్‌ కేంద్ర మంత్రులతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం తొలుత కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్‌ జోషీతో సమావేశమవుతారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చిస్తారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుస్తారు. వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్‌ కార్యక్రమాలపై చర్చిస్తారు. జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీలో పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో నీటి మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల ప్రతిపాదనలపై మాట్లాడతారు. పరిశోధన, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (స్వతంత్ర) మంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం సమావేశమవుతారు. రాష్ట్ర ఆర్థిక రోడ్‌ మ్యాప్‌ కోసం మెరుగైన ఆర్థిక కేటాయింపులు, మద్దతు కోరతారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన రాష్ట్రాల్లో కొత్త క్రిమినల్‌ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి రైల్వే, ఎలకా్ట్రనిక్స్‌-ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అవుతారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, భవిష్యత్‌ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ పాత్రపై చర్చిస్తారు. శనివారం భారత్‌ మండపంలో జరిగే నీతి ఆయోగ్‌ 10వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సీఎం హాజరవుతారు.

Updated Date - May 23 , 2025 | 05:00 AM