Share News

Chandrababu Naidu: ఉగ్రదాడి దిగ్ర్భాంతి కలిగించింది: బాబు

ABN , Publish Date - Apr 24 , 2025 | 06:16 AM

కశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జేఎస్‌ చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు

Chandrababu Naidu: ఉగ్రదాడి దిగ్ర్భాంతి కలిగించింది: బాబు

విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహంపై జాతీయ పతాకం కప్పి నివాళి

విశాఖపట్నం/గోపాలపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జేఎస్‌ చంద్రమౌళి మృతదేహానికి ఆయన బుధవారం రాత్రి నివాళులర్పించారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోడియంపై ఉంచిన మృతదేహంపై స్వయంగా జాతీయ పతాకాన్ని కప్పారు. చంద్రమౌళి తోడల్లుడు కుమార్‌రాజా, బావమరిది బీఎస్‌ నాగేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి, కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అంతిమయాత్ర వాహనం ముందు నడుస్తూ నిర్వహించిన శాంతి ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులను దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు. చంద్రమౌళి బాత్‌రూమ్‌కు వెళ్లారని, ఆ సమయంలో ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెప్పారన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నప్పుడు, ప్రధాని మోదీ వేరే దేశంలో ఉండగా ఇలాంటి ఘటన జరగడం చూస్తుంటే ఏదో కుట్ర ఉందనే భావన కలుగుతోందన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చే యాలని యత్నించే శక్తులపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరువురి కుటుంబాలకు రూ.పది లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించిన వారిలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు అనిత, బాల వీరాంజనేయస్వామి, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పంచకర్ల రమేశ్‌బాబు ఉన్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 06:17 AM