CM Chandrababu: ప్రజల సంతృప్తే ప్రధానం
ABN , Publish Date - May 09 , 2025 | 05:07 AM
రేషన్, దీపం-2 పథకాలు, ధాన్యం సేకరణలో అవకతవకలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులకు ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు
రేషన్, దీపం-2, ధాన్యం సేకరణలోఅవకతవకలకు ఆస్కారం ఉండొద్దు
15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకులు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలన్నారు. మొత్తంగా ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సేవలందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరుపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల్లో పేర్లు నమోదైనప్పటికీ జీఎ్‌సడబ్ల్యూఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై పరిశీలన చేసి, సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
కొత్త రేషన్‌కార్డుల జారీ, ఇతర సేవల కోసం ఈనెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా దరఖాస్తులు స్వీకరించి, సకాలంలో పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. కాగా, ‘రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రైస్ కార్డులు ఉండగా.. అందులో 4,24,59,028 మంది సభ్యులున్నారు. వీరిలో ఇప్పటి వరకు 3.94 కోట్ల మంది మాతమ్రే ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా 23 లక్షల మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు. గడచిన ఖరీఫ్ సీజన్‌లో 35.94 లక్షల టన్నులు, రబీలో 14.28 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని పౌరసరఫరాల అధికారులు సీఎంకు తెలిపారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు పాల్గొన్నారు