Share News

Chandrababu : ‘ఢిల్లీ’ని మించి జగన్‌ అవినీతి

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:59 AM

ఏపీలో మద్యం అమ్మకాల పేరిట జరిగిన భారీ కుంభకోణం ముందు ఢిల్లీ స్కామ్‌ చాలా చిన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Chandrababu : ‘ఢిల్లీ’ని మించి జగన్‌ అవినీతి

  • పాతికేళ్ల వరకు మద్యం ఆదాయం తాకట్టు

  • జగన్‌ అవినీతితో పోల్చితే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ చిన్నదే

  • జగన్‌, కేజ్రీ ప్రయోగాలు విఫలం

  • జనాభా పెరుగుదల రాజకీయ సమస్య కాదు

  • ఏపీ ప్రజలు పూర్తిగా మా వైపే.. పట్టభద్రుల ఫలితాలే నిదర్శనం.. ఢిల్లీలో సీఎం చంద్రబాబు

‘‘మద్యనిషేధం పేరిట నిరంతరం మద్యం ధరలను అప్పట్లో పెంచుతూ పోయారు. ధరలు పెంచితే తాగడం తగ్గుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను కాకుండా జే బ్రాండ్ల పేరిట లోకల్‌ సరుకును అమ్మారు. ఎక్సైజ్‌ ఆదాయాన్ని 25 సంవత్సరాల వరకు జగన్‌ తాకట్టు పెట్టారు. ప్రతి రోజూ బటన్‌ నొక్కడం తప్ప ఏనాడూ సంపద సృష్టించిన పాపాన పోలేదు’’

- ముఖ్యమంత్రి చంద్రబాబు

న్యూఢిల్లీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఏపీలో మద్యం అమ్మకాల పేరిట జరిగిన భారీ కుంభకోణం ముందు ఢిల్లీ స్కామ్‌ చాలా చిన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూఆక్రమణలు, గంజాయి, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ సరఫరా వంటి హేయమైన నేరాలకు గత ప్రభుత్వంలో పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం రూపొందించిన రెండు బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కోరినట్టు చంద్రబాబు తెలిపారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రజలు పూర్తిగా కూటమి వైపే ఉన్నారని చెప్పారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు 60 నుంచి 67.5 శాతానికి పెరిగింది. సంపదను సృష్టించడం, అభివృద్ధి చేయడం, సంక్షేమం, సాధికారికత అనేవి నిరంతర ప్రక్రియ. సంపద పెంచకపోతే ఎలా పంచగలం? అప్పులతో ఆర్థిక సుస్థిరత సాఽఽధించలేం. ఏపీలో నాడు జగన్‌ ప్రభుత్వం, ఢిల్లీలో నిన్నటిదాకా కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీనినుంచి నేతలు గుణపాఠాలు నేర్చుకోవాలి. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయి.


ఎగుమతులు చేసేందుకు అద్భుతమైన పోర్టులు ఉన్నాయి. పరిశ్రమలకు, పెట్టుబడులకు మా రాష్ట్రం స్థావరంగా మారుతోంది. దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటివరకు ఏపీకి వచ్చాయి’ అని తెలిపారు.

పరిజ్ఞానం వేరు...భాష వేరు

జనాభా తగ్గినంతమాత్రాన రాష్ట్రాలకు నష్టం వస్తుందనేది ఊహాగానం మాత్రమేనని సీఎం అన్నారు. ‘డీలిమిటేషన్‌ నిరంతర ప్రక్రియ. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాల్సి ఉంది. ఈవిషయంపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రస్తుతం జనాభా నియంత్రణ కన్నా జనాభా నిర్వహణపై దృష్టి కేంద్రీకరించడం అవసరం. జనాభా రాజకీయ సమస్య కానే కాదు. మాతృభాషను ప్రోత్సహించాల్సిందే. ఇంగ్లీష్‌ జీవనోపాధికి మాత్రమే ఉపయోగపడే భాష. గత ప్రభుత్వం అనాలోచితంగా ఇంగ్లీష్‌ విద్యను ప్రోత్సహించింది. నిజానికి పరిజ్ఞానం వేరు...భాష వేరు. భాష కమ్యూనికేషన్‌కు సాధనం మాత్రమే. నేను ప్రతి యూనివర్సిటీలో 5 నుంచి 10 భాషలను నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాను. అంతర్జాతీయ భాషలు నేర్చుకుని ఉపాధి కోసం ఉపయోగించుకోవచ్చు. హిందీ ప్రజల మధ్య సంబంధాలు పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని తెలిపారు.

Updated Date - Mar 06 , 2025 | 04:02 AM