BC Welfare Boost: బీసీలకు అండ
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:32 AM
బీసీల అభివృద్ధికి చట్టంతో అండగా ఉంటామని సీఎం చంద్రబాబు చెప్పారు బీసీ సబ్‌ప్లాన్ కింద రూ 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు

వారి రక్షణకు అతి త్వరలో ప్రత్యేక చట్టం: చంద్రబాబు
సబ్‌కమిటీ నివేదిక రాగానే చేస్తాం.. స్థానిక సంస్థల్లో మళ్లీ 34% కోటా
బీసీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది రూ.48 వేల కోట్ల ఖర్చు
బీసీ హాస్టళ్లకు రూ.4,500 కోట్లు.. 5,720 మందికి డీఎస్సీ శిక్షణ
ఇంటిపైనే విద్యుదుత్పత్తికి బీసీలకు కూడా సౌర ఫలకలు
వారు ఇళ్లు కట్టుకుంటే అదనంగా రూ.50 వేల సబ్సిడీ
బీసీ కార్పొరేషన్ కింద రూ.250 కోట్ల రుణాలు విడుదల
నా తల్లి బాధ చూసి ‘దీపం’ తెచ్చా.. రేపో, ఎల్లుండో ‘తల్లికి వందనం’
తప్పులు చేస్తే ఖబడ్దార్.. ‘సోషల్’ సైకోలకు అదే చివరి రోజు: సీఎం
ఫూలే జయంతి సందర్భంగా ఆగిరిపల్లిలో ప్రజా వేదిక, పీ4 సభ
విజయవాడ/ఏలూరు/నూజివీడు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బలహీనవర్గాల రక్షణ, అభ్యున్నతికి ఇప్పటికీ ఎప్పటికీ కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. వారికి పూర్తి అండగా ఉంటామని.. వారి రక్షణ కోసం త్వరలోనే చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. వారిని అన్ని వర్గాలతో సమానంగా.. అవసరమైతే అందరికంటే ముందుండే విధంగా తయారు చేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమం కూడా నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ నుంచి తొలి విడతగా రూ.275 కోట్ల రుణాలను లబ్ధిదారులకు విడుదల చేశారు.
బీసీ చట్టంపై ఇప్పటికే సబ్‌కమిటీ వేశామని, నివేదిక రాగానే ఆ చట్టం తీసుకొస్తామని బీసీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది రూ.48వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడంతో ఆదరణ-3 ద్వారా చేతివృత్తులు, కులవృత్తుల మనుగడకు కృషి చేస్తామన్నారు. బలహీన వర్గాల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో సివిల్ సర్వీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, 500 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇచ్చేలా చూస్తామన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. పెండింగ్‌లో రూ.76కోట్లు ఉంటే వెంటనే విడుదల చేయాలని ఆదేశించానని చెప్పారు. డీఎస్సీలో ఎక్కువ మంది బీసీలు ఉత్తీర్ణులయ్యేందుకు 5,720మందికి శిక్షణ కార్యక్రమాలు పెడతామన్నారు. ఆదరణ-3 కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
బీసీల ఆదాయం పెంచేందుకు..
వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులు పోయాయి. చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీల ఆదాయం పెంచేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కల్లుగీత కార్మికులకు మద్యం షాపులలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం. వారికి ఫీజుల్లోనూ 50 శాతం రాయితీ కల్పించి ఎక్కువ ఆదాయం వచ్చేలా చేశాం. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. వెనుకబడిన వర్గాలు ఇళ్లు కట్టుకుంటే అదనంగా రూ.50 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. ఎస్సీలు పైసా చెల్లించకుండా సూర్యఘర్ యూనిట్లు పెట్టుకోవచ్చు. బీసీలకు కూడా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తికి సోలార్ ఫలకలు పెట్టిస్తాం. దేవాలయాల్లో పని చేసే నాయీబ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.15వేల నుంచి రూ.25 వేలకు పెంచాం. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నాం. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు 33శాతం కోటా పెట్టాం.
అన్నీ చేయాలనుంది.. గల్లాపెట్టె ఖాళీ..
సంపద సృష్టించాలి. అభివృద్ధి చేయాలి. ఆదాయాన్ని పెంచాలి. పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. మీకోసం ఎన్నో చేయాలనుంది. కానీ గల్లా పెట్టె ఖాళీగా ఉంది. అప్పులు తేవాలనుకుంటే ఇచ్చేవారు లేరు. నాపై ఉన్న నమ్మకంతో ఎంతోకొంత అప్పువస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 64 లక్షల మంది పేదలకు రూ.33వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నాం. ఏపీలో రూ.4వేలు ఇస్తుంటే తెలంగాణ ఇచ్చేది రూ.2,600 మాత్రమే. ఏపీలో దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితం అయితే రూ.15 వేలు ఇస్తున్నాం. ఆ రోజున నా మానస పుత్రికగా డ్వాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నడిపా. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేసే బాధ్యత తీసుకున్నాం. నా తల్లి కట్టెల పొయ్యితో పడిన బాధ కళ్లారా చూశాను. ఆ బాధ నా చెల్లెళ్లు పడకూడదనే 1996-97లో దీపం-1 పెట్టాను. సూపర్-6 హామీలో భాగంగా దీపం-2 కింద ఏటా 3 సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపో ఎల్లుండో తల్లికి వందనం ఇస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తాం.
సోషల్ మీడియా సైకోలకు వార్నింగ్..
రాజకీయాలు దిగజారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డలపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. వ్యక్తిత్వ హననం చేసే వ్యక్తులకు అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా. సోషల్ మీడియా వల్ల నేనే తప్పుదారి పట్టాను. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని వార్త చూశా. అది గొడ్డలి వేటని తెలుసుకునేందుకు చాలా సమయం పట్టింది. ఒక సీఎం స్థాయి వ్యక్తినే మోసం చేయగలిగారంటే సామాన్యులొక లెక్కా? (జగన్) అనంతపురం పోయి ఎన్ని డ్రామాలు ఆడారో చూశాం. 2019-24మధ్య రాష్ట్రంలో నేనే తిరగలేకపోయా. కానీ ఇప్పుడు ఎవరైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాం. అయితే రౌడీయిజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే గట్టిగా ఉండాలా లేదా?
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వచ్చేవరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగలేదు. బీసీలు పూర్తిగా నష్టపోయారని, వారికి గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీయే.
వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలు ఉన్నారు. వారికి సరైన చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించగలుగుతారు.
పేదలను ఆదుకుని శాశ్వతంగా పైకి తీసుకొస్తే పూలేను గుర్తు పెట్టుకున్నట్లుగానే మార్గదర్శకులను గుర్తుంచుకుంటారు. ఒక స్థాయి వరకు సొంతానికి, వ్యక్తిగతంగా కష్టపడదాం. తర్వాత మంచి పేరు కోసం కృషిచేద్దాం. అలాంటి వేదిక కోసమే మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమం.
గత ప్రభుత్వం అనుకూలం కాని ఇంటి జాగాలిచ్చింది. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించిన తర్వాతే మళ్లీ ఓటు కోసం వస్తా. నివాసయోగ్యమైన ఇళ్లు కట్టిస్తా.
- సీఎం చంద్రబాబు
For AndhraPradesh News And Telugu News