Share News

AP Irrigation Projects: మరమ్మతులు ఎప్పుడు..

ABN , Publish Date - May 20 , 2025 | 06:26 AM

వర్షాకాలం సమీపిస్తుండగా, కాలువలు, సాగునీటి ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ కోసం అవసరమైన రూ.344.39 కోట్లు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం ఆమోదించినా ఇప్పటివరకు నిధుల విడుదల జరగలేదు.

AP Irrigation Projects: మరమ్మతులు ఎప్పుడు..

  • వర్షాకాలం సమీపిస్తున్నా యాజమాన్య నిర్వహణకు నోచుకోని ప్రాజెక్టులు, కాలువలు

  • 344 కోట్లు కోరిన జలవనరుల శాఖ

  • మంత్రివర్గం ఓకే.. ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌

  • ‘బుడమేరు’ అనుభవమున్నా స్పందించని వైనం

  • వెంటనే నిధులు ఇవ్వాలని కోరుతున్న రైతులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వర్షాకాలం సమీస్తున్నా.. సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు యాజమాన్య నిర్వహణకు నోచుకోవడం లేదు. యాజమాన్య నిర్వహణకు రూ.344.39 కోట్లు కావాలని జల వనరుల శాఖ కోరినా ఆర్థిక శాఖ నుంచి సానుకూల స్పందన రాలేదు. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించడంతో పాటు కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపినా ఫలితం లేకుండా పోయింది. ఆర్థిక శాఖ వద్ద ఫైలు ఇంకా పెండింగ్‌లో ఉంది. బుడమేరు వరద బీభత్సం నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలతో ముప్పు ఏర్పడితే పరిస్థితి ఏమిటని జల వనరుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, కాలువల సాధారణ యాజమాన్య నిర్వహణ కోసం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సగటున రెండు కోట్ల చొప్పున మొత్తం రూ.344.39 కోట్లు అవసరమని జల వనరుల శాఖ అంచనా వేసింది. వానాకాలం వచ్చేలోగా ప్రాజెక్టుల మరమ్మతులు, రేడియల్‌ గేట్లకు గ్రీజు పూయడం, ఇతర నిర్వహణ చర్యలతో పాటు పంట కాలువల పూడికతీత పనులు చేయాలని నిర్ణయించింది. దీంతో నిధులు కేటాయించాలని మొదట ఆర్థిక శాఖను కోరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాలని సలహా ఇస్తూ ఆర్థిక శాఖ ఫైలును తిప్పి పంపింది. జల వనరుల శాఖకు కేటాయించిన నిధుల నుంచే ప్రాధాన్య క్రమంలో నిధులు వాడుకోవచ్చంటూ సూచించింది. ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయించాక వేరే పనుల కోసం ఎలా ఖర్చు చేయగలమని జల వనరుల శాఖ ప్రశ్నిస్తోంది. ప్రాజెక్టుల వారీగా కాకుండా ఏకమొత్తంలో నిధులు కేటాయిస్తే ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. ఆర్థిక శాఖ ఉచిత సలహాలపై జల వనరుల శాఖ మండిపడుతోంది.


బుడమేరు అనుభవమున్నా..

పులికనుమ ప్రాజెక్టు కాలువలు పూర్తిగా పూడుకు పోయాయి. బుడమేరు గండ్లు సాంకేతిక విధానంలో పూడ్చాల్సి ఉంది. నియోజకవర్లాల్లోని చిన్నతరహా ఏరులు కనిపించకుండా పోయాయి. ఈ ఏరులపై ఆధారపడ్డ కాలువలు కబ్జాలకు లోనయ్యాయి. ఎగువన ఉన్న ఖమ్మం చెరువుకు కట్టలు తెగితే.. జలాలు నేరుగా కిందకు వచ్చేసి లోతట్టు ప్రాంతాలను ముంచేస్తాయి. గత ఏడాది ఖమ్మం చెరువుకు గండ్లు కారణంగానే బుడమేరుకు వరద వచ్చింది. ఈ వరద ప్రభావంతో విజయవాడ అతలాకుతలం అయింది. వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ముందస్తుగా కార్యాచరణ అమలు చేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కాలువల మరమ్మతుల కోసం ఎంత వ్యయం అవుతుందో అంచనాలను తెప్పించింది. ఈ అంచనా మేరకు సాగునీటి యాజమాన్య నిర్వహణకు రూ.344.39 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరింది.


ముఖ్యమంత్రి అంగీకరించినా..

నిధుల మంజూరుకు ఆర్థిక శాఖ స్పందించకపోవడంతో జలవనరుల శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. వానా కాలానికి ముందుగానే ప్రాజెక్టులు, కాలువల యాజమాన్య నిర్వహణ చేపట్టకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వివరించారు. వారి మాటల్లో వాస్తవాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టులు, కాలువల యాజమాన్య నిర్వహణ కోసం రూ.344.39 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. అయినా ఇప్పటి వరకూ ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేయలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. వీటి ప్రభావంతో వానలు కురుస్తాయి. ఈ సమయంలో కాలువల పూడికతీతకు వీలుండదు. నిధులు విడుదల చేయకపోతే.. ఈ ఏడాది ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ అటకెక్కినట్లేనని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ విధానాలు చూశాక రాష్ట్రంలోని కాంట్రాక్టు సంస్థలేవీ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు నిధులు లేకున్నా.. సాగునీటి యాజమాన్య నిర్వహణపై మంత్రి రామానాయుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉండటం జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే నిధులు విడుదల చేయాలని నిపుణులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2025 | 06:27 AM