Share News

Group1 Scam Twist: గ్రూప్‌-1 మూల్యాంకనం కేసులో పోలీసుల అదుపులో కామ్‌సైన్‌ మధు

ABN , Publish Date - May 07 , 2025 | 04:10 AM

గ్రూప్-1 డిజిటల్ మూల్యాంకనం కేసులో కామ్‌సైన్ డైరెక్టర్ మధుసూదన్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారణ అనంతరం నేడు కోర్టులో హాజరు చేసే అవకాశం ఉంది

Group1 Scam Twist: గ్రూప్‌-1 మూల్యాంకనం కేసులో పోలీసుల అదుపులో కామ్‌సైన్‌ మధు

  • హైదరాబాద్‌ కార్యాలయంలో సోదాలు

  • అనంతరం విజయవాడకు తరలింపు

  • టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో సుదీర్ఘ విచారణ

  • ఏపీపీఎస్సీ ఆఫీసులోనూ ప్రశ్నించిన వైనం

  • నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం

  • ప్రధాన నిందితుడు పీఎస్‌ఆర్‌పై పీటీ వారెంట్‌!

విజయవాడ, మే 6(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల డిజిటల్‌ మూల్యాంకనం కేసులో ‘కామ్‌సైన్‌’ సంస్థ డైరెక్టర్‌ పమిడికాల్వ మధుసూదన్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని కామ్‌సైన్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనంతరం మంగళవారం ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. ఎంజీ రోడ్డులో ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయంలో కూడా ప్రశ్నించారు. డిజిటల్‌ మూల్యాంకనానికి సంబంధించిన ఫైళ్లను ముందుపెట్టి.. ఆ సమయంలో వాటిని నిర్వహించిన కమిషన్‌ సిబ్బందిని కూడా మధుసూదన్‌తో పాటు కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డిజిటల్‌ మూల్యాంకనం కాంట్రాక్టును కామ్‌సైన్‌కు అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు స్వయంగా ఇచ్చారా.. నాటి సీఎంవో నుంచి ఎవరైనా సిఫారసు చేస్తే ఇచ్చారా అని అడిగినట్లు సమాచారం. అయితే పలు ప్రశ్నలకు ఆయన జవాబులివ్వకుండా దాటవేత ధోరణితో వ్యవహరించినట్లు తెలిసింది. ఆయన్ను బుధవారం విజయవాడ ఒకటో అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం.


ఈ డిజిటల్‌ మూల్యాంకనం కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో ఆయన ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. గ్రూప్‌-1 కేసులో ఆయన్ను కోర్టులో హాజరుపరచాలంటే పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ముందుగా మధుసూదన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాక పీఎస్‌ఆర్‌పై పీటీ వారెంట్‌ ప్రయోగిస్తారని అంటున్నారు. ఈ కేసును నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

ఎవరీ మధుసూదన్‌?

పమిడికాల్వ మధుసూదన్‌ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందినవారు. హైదరాబాద్‌ కేంద్రంగా పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక మీడియా సంస్థలో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. బాలు అనే స్నేహితుడితో కలిసి ధాత్రి అనే మీడియా సంస్థను స్థాపించారు. వైఎస్‌ జమానాలో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్టును దక్కించుకున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారంలోకి వచ్చాక.. అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ప్రసారం చేసే కాంట్రాక్టు పొందారు. ఆ క్రమంలోనే కామ్‌సైన్‌ సంస్థను హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

Updated Date - May 07 , 2025 | 04:10 AM